ప్రపంచవ్యాప్తంగా 131 దేశాల్లోని తమ వినియోగదారుల లొకేషన్ డేటాను పబ్లిష్ చేసేందుకు సిద్ధమైంది ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాల్లో తమ వంతు సాయంగా ఈ నిర్ణయం తీసుకుంది. ప్రత్యేక వైబ్సైట్లో శుక్రవారం నుంచి ఈ సమాచారాన్ని అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. కరోనా నియంత్రణకు అనుసరించాలని కోరుతున్న సామాజిక దూరం ప్రభావాన్ని అంచనా వేసేందుకు ప్రభుత్వాలకు ఈ సమచారం ఉపయోగపడుతుందని సంస్థ బ్లాగ్‌లో తెలిపింది గూగుల్.
"కొవిడ్-19ను ఎలా ఎదుర్కోవాలన్న నిర్ణయాలకు ఈ రిపోర్టులు ఉపయోగపడతాయని భావిస్తున్నాం. అయితే దీని ద్వారా వ్యక్తిగత సమాచారమైన కాంటాక్టులు, కదలికలు, లొకేషన్‌ను బహిర్గతం చేయం."
- గూగుల్
చైనా, సింగపూర్, ఇజ్రాయెల్ ప్రభుత్వాలు కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేలా.. ఇప్పటికే తమ దేశ పౌరులపై ఎలక్ట్రానిక్ పర్యవేక్షణ చేయాలని ఆదేశించాయి. ఐరోపా, అమెరికాలోనూ స్మార్ట్‌ఫోన్ డేటా ద్వారా ట్రాక్ పౌరులను ట్రాక్ చేస్తున్నారు. వ్యక్తిగత సమాచారానికి అత్యంత ప్రాధాన్యతనిచ్చే జర్మనీ కూడా ఒక స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారా కరోనా కట్టడికి ప్రయత్నిస్తోంది.