అమెరికాలో కరోనా వ్యాప్తి కొనసాగుతున్నా దేశవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక ఆంక్షలను సడలిస్తూనే ఉన్నారు. అయితే తమ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలను పాటించటం వదిలేయమని అమెరికన్లు చెబుతున్నట్లు ఓ సర్వే వెల్లడించింది.
ఈ పోల్‌లో పాల్గొన్న చాలామంది అమెరికన్లు మాస్కులు ధరిస్తున్నామని చెప్పారు. ఇప్పటికీ రెస్టారెంట్ల వైపు చూడటం లేదని, ఇతరుల నుంచి కనీసం 6 అడుగుల దూరం పాటిస్తున్నట్లు స్పష్టం చేశారు. చాలా మంది ఆర్థిక అంశాలతో పాటు సమాజమూ క్షేమంగా ఉండాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.
షికాగో విశ్వవిద్యాలయానికి చెందిన ఎన్ఓఆర్సీ విభాగం ఈ సర్వే నిర్వహించింది. అమెరికాలో కరోనా ప్రభావం, అమెరికన్ల భౌతిక, మానసిక ఆరోగ్యంపై ఈ పోల్ నిర్వహించటం ఇది మూడోసారి. ఇందులోని కీలకాంశాలు:
- దేశంలో మొత్తంగా 90 శాతం మాస్కులు ధరిస్తున్నామని చెప్పారు. ఏప్రిల్‌లో కన్నా ఇది అధికం. ఆ నెలలో 78 శాతం మాస్కులు వినియోగించారు.
- సామాజిక కార్యక్రమాలను రద్దు చేసుకున్నట్లు 63 శాతం మంది వెల్లడించారు. ఏప్రిల్‌లో ఇది 69 శాతం ఉంది.
- బహిరంగ ప్రదేశాలు, జనాలు గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకుండా ఉంటున్నవారు 75 శాతం ఉన్నారు. ఏప్రిల్‌తో పోల్చితే 5 శాతం తగ్గారు.
- ఎవరితోనైనా వైరస్ సోకే ప్రమాదం ఉందని అనుమానం ఉంటే వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. ఏప్రిల్‌లో 62 శాతం దీన్ని అనుసరించగా ప్రస్తుతం 56 శాతానికి తగ్గారు.
- ఇతరులతో 6 అడుగుల దూరం పాటిస్తున్నవారు 83 శాతం మంది ఉన్నారు. మాస్కులు ధరించి శానిటైజర్లను అందుబాటులో పెట్టుకుంటున్నట్లు వారు తెలిపారు.
- 72 శాతం మంది అమెరికన్లు రెస్టారెంట్లకు వెళ్లేందుకు ఇష్టపడటం లేదు.
కాంటాక్ట్ ట్రేసింగ్‌పై విముఖత..
జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ చాలా మంది అమెరికన్లు కాంటాక్ట్ ట్రేసింగ్‌కు సహకరించట్లేదని అధికారులు చెబుతున్నారు. సన్నిహితంగా ఉన్నవారిని వేగంగా గుర్తించి పరీక్షలు నిర్వహిస్తేనే వ్యాధిని అరికట్టగలమని అంటున్నారు.
సుమారు 10 మందిలో ఆరుగురు ట్రాకింగ్ యాప్‌ను ఇన్స్టాల్ చేసుకునేందుకు నిరాకరిస్తున్నారు. లక్షణాలు, సిఫార్సులకు సంబంధించి ప్రశ్నలు వేసే యాప్ లేదా వెబ్‌సైట్‌ను ఉపయోగించేందుకు సిద్ధంగా లేమని తెలిపారు. గోప్యతను కాపాడునేందుకు కాంటాక్ట్ ట్రేసింగ్‌కు నిరాకరిస్తున్నట్లు తెలుస్తోంది.