దేశంలో కరోనా మృతుల సంఖ్య వాస్తవానికి భిన్నంగా ఉందని మెక్సికో అధికారులు అంగీకరించారు. ఈ ఏడాది సెప్టెంబర్ 26 వరకు దేశవ్యాప్తంగా 1,93,170 అదనపు మరణాలు నమోదవ్వగా.. వీటిలో కరోనా మరణాలు 1,39,153గా ఉండొచ్చని పేర్కొన్నారు. ఇది ప్రస్తుత మరణాల సంఖ్య(89,000) కన్నా 50వేలు ఎక్కువ అని స్పష్టం చేశారు.
కరోనా సంక్షోభంలో 1,03,882 మంది మృతిచెందినట్టు గతంలో అంచనా వేసింది మెక్సికో. అయితే తాజా అంచనాలు.. వీటికన్నా 56శాతం అధికంగా ఉండటం గమనార్హం.
మెక్సికోలో పరీక్షల రేటు చాలా తక్కువ. చాలా మంది పరీక్షలు చేయించుకోలేదని... చేసిన పరీక్షల్లోనూ లోపాలున్నాయని గత అంచనాలను వెల్లడించే సమయంలో ప్రకటించారు అధికారులు. అయితే ఇప్పుడు పరిస్థితులను క్షుణ్నంగా విశ్లేషించినట్టు వెల్లడించారు. కొత్త మరణాలకు సంబంధించిన వివరాలను త్వరలో విడుదల చేస్తామని స్పష్టం చేశారు.
మరణానికి కరోనా కారణం కాకపోయినా.. వైరస్ లక్షణాలు ఉంటే మాత్రం కొవిడ్ మృతులుగానే పరిగణిస్తున్నారు. 2019తో సగటు మరణాలను తీసుకుని 2020తో పోల్చి 'అదనపు' మృతుల సంఖ్యను లెక్కిస్తారు.
ఇదీ చూడండి:- స్పెయిన్లో ఎమర్జెన్సీ- రాత్రి కర్ఫ్యూ విధింపు