ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి(యూఎన్ఎస్సీ)లో ఐదు తాత్కాలిక సభ్యదేశాల కోసం బుధవారం (జూన్ 17న) ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో భారత్ ఘన విజయం సాధించింది. తాత్కాలిక సభ్య దేశాల కోసం ఎలాంటి ప్లీనరీ సమావేశం లేకుండానే రహస్య బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించారు. 2021-22 కాలపరిమితి కోసం జరిగే ఈ ఎన్నికల్లో ఆసియా- పసిఫిక్ స్థానానికి భారత్ మాత్రమే పోటీలో ఉన్నందున ఏకగ్రీవంగా ఎన్నికైంది.
ఓటింగ్‌లో పాల్గొన్న 192 సభ్య దేశాల్లో కావాల్సిన మెజారిటీ మూడింట రెండొంతులు (128) దాటుకుని 184 ఓట్లు సాధించింది భారత్. ఈ ఎన్నికల్లో కెనడా ఓటమి పాలైంది. భారత్‌తో పాటు ఐర్లాండ్, మెక్సికో, నార్వేలు భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశాలుగా ఎన్నికయ్యాయి.
" అత్యధిక మద్దతుతో 2021-22 కాలానికి ఐరాస భద్రతా మండలి తాత్కాలిక సభ్య దేశంగా భారత్‌ను ఎన్నుకున్నాయి సభ్య దేశాలు. పోలైన 192 ఓట్లలో భారత్‌కు 184 ఓట్లు వచ్చాయి."
- ఐరాసకు భారత శాశ్వత ప్రతినిధి
2021-22 కాలపరిమితికి సంబంధించి ఆసియా- పసిఫిక్ స్థానం కోసం భారత్ అభ్యర్థిత్వానికి గత ఏడాది జూన్‌లోనే చైనా, పాకిస్థాన్ సహా ఈ విభాగంలోని మొత్తం 55 దేశాలు మద్దతు తెలిపాయి.
ఎనిమిదోసారి..
ప్రస్తుత ఎన్నికతో ఐరాస భద్రతా మండలికి భారత్ ఎనిమిదో సారి ఎన్నికైనట్లయింది. భారత్ చివరిసారిగా 2011-2012లో ఐరాస భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యదేశంగా వ్యవహరించింది. అంతకుముందు 1950-51, 1967-68, 1972-73, 1977-78, 1984-85, 1991-92లో సభ్య దేశంగా ఉంది.
శాశ్వత సభ్యత్వంపై..
భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం భారత్ దశాబ్దాలుగా పోరాడుతోంది. అయితే 21వ శతాబ్దపు భౌగోళిక, రాజకీయ పరిస్థితులు అందుకు సానుకూలంగా లేవు. భద్రతా మండలిలో పది తాత్కాలిక సభ్యదేశాలకు సంబంధించి.. ఏటా ఐదు స్థానాలకు రెండేళ్ల కాలపరిమితితో ఎన్నికలు జరుగుతాయి. ఈ పది దేశాలను ప్రాంతీయత ఆధారంగా నిర్ణయిస్తారు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు ఐదు స్థానాలు, తూర్పు ఐరోపాకు ఒకటి, లాటిన్ అమెరికా, కరీబియన్‌కు సంయుక్తంగా రెండు, పశ్చిమ ఐరోపా, మిగతా దేశాలకు కలిపి 2 స్థానాలు కేటాయిస్తారు.
ఇదీ చూడండి: కరోనా రోగులకు ప్రాణదాతగా మారిన ఔషధం!