కొవిడ్ వ్యాప్తి సహా పలు అంశాల్లో చైనాపై గుర్రుగా ఉన్న అమెరికా దాన్ని దెబ్బకొట్టే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి చెందిన ప్రముఖ మొబైల్ సాంకేతిక దిగ్గజాలు హువావే, జెడ్‌టీఈ నుంచి భద్రతాపరమైన ముప్పు పొంచి ఉందని ప్రకటించింది. ఈ సంస్థల నుంచి చేసే కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఈ మేరకు అమెరికా 'ఫెడరల్ కమ్యూనికేషన్ కమిషన్'(ఎఫ్‌సీసీ) మంగళవారం ప్రకటన జారీ చేసింది.
కొనుగోళ్లపై నిషేధం..!
అమెరికాలో టెలికాం సర్వీసెస్‌ను విస్తరించే దిశగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఈ పరికరాలను వాడకూడదు. విస్తరణ పనులకు ఏర్పాటు చేసిన ప్రత్యేక 'యూనివర్సల్ సర్వీస్ ఫండ్' నిధులతో ఈ సంస్థల నుంచి పరికరాలు కొనుగోలు చేయకూడదు. అలాగే ఇతర సేవల్ని పొందడానికి కూడా ఆ నిధుల్ని వినియోగించొద్దు. ఈ ఏడాది ఎఫ్‌సీసీకి 8.3 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.62,676 కోట్లు) కేటాయించారు. అమెరికా మొబైల్ నెట్‌వర్క్ వ్యవస్థను రక్షించుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని ఎఫ్‌సీసీ తన ప్రకటనలో పేర్కొంది.
ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో 5జీ సాంకేతికతకు సంబంధించిన మౌలిక వసతుల ఏర్పాట్లలో హువావే కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా తాజా నిర్ణయంతో వాటిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. దీంతో సంస్థ మనుగడే ప్రశ్నార్థకంగా మారనున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
బలమైన ఆధారాలు..
అమెరికా జాతీయ భద్రతకు హువావే, జెడ్‌టీఈ నుంచి ముప్పు పొంచి ఉందనడానికి బలమైన ఆధారాలున్నాయని ఎఫ్‌సీసీ ఛైర్మన్ అజిత్ పాయ్ ప్రకటించారు. 5జీ భవిష్యత్తుకు సైతం సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ, ఆ దేశ సైనిక వ్యవస్థతో ఈ రెండు కంపెనీలకు సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తేలిందన్నారు. ఈ సంస్థల నిబంధనలు చైనా నిఘా వ్యవస్థలకు సహకరించే చట్టాలకు లోబడి ఉన్నాయని స్పష్టం చేశారు.
కాంగ్రెస్ పరిశీలనలు, నిఘా వర్గాల అభిప్రాయాలు, ఇతర దేశాల్లోని సర్వీస్ ప్రొవైడర్ల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అమెరికా సమాచార, సాంకేతిక వ్యవస్థల్ని కొల్లగొట్టేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీకి ఏమాత్రం అవకాశం ఇచ్చేది లేదని తేల్చి చెప్పారు.
మరోవైపు భారత్ కూడా చైనాకు చెందిన టిక్‌టాక్ సహా 59 యాప్‌లపై సోమవారం నిషేధం విధించింది. ఈ తరుణంలోనే అమెరికా తాజా నిర్ణయం వెలువడడం ప్రాధాన్యం సంతరించుకుంది.
ఇదీ చూడండి: జీతాలు తగ్గించం, ఉద్యోగులను తొలగించం: టిక్‌టాక్