ప్రపంచ దేశాలను కరోనా వైరస్ కలవరపెడుతోంది. ప్రాణాంతక వైరస్ తమకు ఎక్కడ సోకుతుందోనని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దగ్గు, తుమ్ము, జలుబు.. ఏది వచ్చినా ఉలిక్కిపడుతున్నారు. అయితే.. అసలు వైరస్ సోకిన తర్వాత లక్షణాలు బయటపడటానికి ఎంత సమయం పడుతుంది? అనే ప్రశ్నపై పరిశోధన జరిగింది.
వైరస్ సోకితే సగటున 5.1 రోజులకు లక్షణాలు బయటపడతాయని అన్నాల్స్ ఆఫ్ ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్ ఓ నివేదిక ప్రచురించింది. కరోనా బాధితులకు సంంబంధించి అందుబాటులో ఉన్న వివరాల ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.
ప్రపంచవ్యాప్తంగా అమలులో ఉన్న 14 రోజుల నిర్బంధ కాలం తగినదేనని నివేదిక పేర్కొంది. నిర్బంధ కాలం ముగిసిన అనంతరం.. ప్రతి 10వేల మందిలో 101మందికి మాత్రమే లక్షణాలు కనపడతాయని వెల్లడించింది.
ఫిబ్రవరి 24వ తేదీకి ముందు చైనా సహా ఇతర దేశాల్లో నమోదైన 181 కేసులపై పరిశోధన చేశారు శాస్త్రవేత్తలు. ఈ కేసులన్నీ వైరస్ కేంద్రబిందువైన వుహాన్‌తో సంబంధం ఉన్నట్టు తెలిపారు.
వారు జాగ్రత్తగా ఉండాలి...
అధిక రక్తపోటు, మధుమేహ వ్యాధి బాధితులు.. వైరస్ సోకితే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉందని మరో నివేదిక పేర్కొంది. చైనా వుహాన్‌లోని రెండు ఆసుపత్రుల్లో ఉన్న 191 రోగులను పరిశీలించిన అనంతరం ఈ నివేదికను ప్రచురించింది లాన్సెట్ జర్నల్.
ఇదీ చూడండి:- ఎయిడ్స్ మందులతో కరోనా వైరస్‌కు వైద్యం!