అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌లో మరో మారణహోమం త్రుటిలో తప్పింది! అక్కడి హమీద్ కర్జాయ్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద పేలుళ్లకు ఉగ్రవాదులు పన్నిన కుట్రను అమెరికా భగ్నం చేసింది. దాడి చేసేందుకు దూసుకొస్తున్న ఆత్మాహుతి దళ సభ్యులను ముందే మట్టుబెట్టింది. మరోవైపు- దేశంలో ఎవరికీ హాని తలపెట్టబోమంటూ ఇచ్చిన హామీని తాలిబన్లు మరోసారి తుంగలోకి తొక్కారు. ప్రముఖ జానపద గాయకుడిని కిరాతకంగా కాల్చిచంపారు. మహిళల హక్కుల పరిరక్షణపైనా వారు మాట తప్పారు. కాందహార్‌లో టీవీలు, రేడియోల్లో సంగీతంతో పాటు మహిళల స్వరంపై నిషేధం విధించారు.
కాబుల్ విమానాశ్రయం వద్ద గత గురువారం నరమేధానికి పాల్పడ్డ ఐఎస్ఐఎస్-కె ఉగ్ర సంస్థ ఆదివారం మరోసారి అలాంటి దాడికి వ్యూహరచన చేసిందని అమెరికా సెంట్రల్ కమాండ్ అధికార ప్రతినిధి కెప్టెన్ బిల్ అర్బన్ తెలిపారు. ఆత్మాహుతి పేలుళ్లకు పాల్పడేందుకు ఓ వాహనంలో ముష్కరులు దూసుకురావడాన్ని తాము గుర్తించామన్నారు. డ్రోన్ దాడి ద్వారా వారిని హతమార్చామని చెప్పారు. డ్రోన్ దాడి అనంతరం భారీ పేలుళ్లు చోటుచేసుకున్నాయని.. వాహనం నిండా పేలుడు పదార్థాలు ఉన్నట్లు తద్వారా స్పష్టమవుతోందని వివరించారు.
ముగ్గురు చిన్నారులు మృతి
కాబుల్ విమానాశ్రయానికి వాయవ్య దిశలో.. కేవలం ఒక కిలోమీటరు దూరంలోని ఖువ్జా బుఘ్రా ప్రాంతంలో రాకెట్ దాడి చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయినట్లు కాబుల్ పోలీసు బాస్ రషీద్ వెల్లడించారు. దాడికి పాల్పడిందెవరో ప్రస్తుతానికి తెలియరాలేదన్నారు. ఖువ్జా బుఘ్రాలో చోటుచేసుకున్న రాకెట్ దాడి, అమెరికా బలగాలు జరిపిన డ్రోన్ దాడి.. వేర్వేరు ఘటనలు కాదని కూడా కొన్ని వార్తాసంస్థల్లో కథనాలు రావడం గమనార్హం.
కళాకారుడిపై కర్కశత్వం
బగ్లాన్ ప్రావిన్సులోని అందారాబ్ లోయలో తాలిబన్లు ప్రముఖ జానపద గాయకుడు ఫవాద్ అందారాబీని క్రూరంగా చంపిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత శుక్రవారం ఫవాద్ ఇంటికి వెళ్లిన తాలిబన్లు.. ఆయన్ను కాల్చిచంపారు. వాస్తవానికి వారు గతంలోనూ తమ ఇంటికి వచ్చి సోదాలు నిర్వహించారని ఫవాద్ తనయుడు జవాద్ తెలిపారు. నాడు తన తండ్రితో కలిసి తేనీరు కూడా తాగారని పేర్కొన్నారు. శుక్రవారం మాత్రం పరిస్థితి మారిపోయిందని.. ఆయన్ను కిరాతకంగా కాల్చిచంపారని చెప్పారు. న్యాయం కోసం తాను స్థానిక తాలిబన్ మండలిని ఆశ్రయించానని తెలిపారు.
హంతకులను శిక్షిస్తామని మండలి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఫవాద్ హత్య గురించి తమకు తెలియదని తాలిబన్ అధికార ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ అన్నారు. ఈ ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తామని చెప్పారు. ఫవాద్ హత్యను ఐక్యరాజ్య సమితి, ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ఖండించాయి.
మహిళల హక్కులపై మాట తప్పి..
మహిళలు చదువుకునేందుకు, పనిచేసేందుకు అనుమతిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన తాలిబన్లు.. వాస్తవంలో అందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. తాజాగా వారు కాందహార్‌లో టీవీలు, రేడియో ఛానెళ్లలో సంగీతాన్ని నిషేధించారు. మహిళల స్వరాన్ని ప్రసారం చేకూడదని కూడా వాటి యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేశారు.
పంజ్‌షేర్‌లో అంతర్జాల సేవలు బంద్
అఫ్గాన్‌లో ఇంకా తమ అధీనంలోకి రాని పంజ్‌షేర్ ప్రావిన్సుకు అంతర్జాల సేవలను తాలిబన్లు నిలిపివేశారు. దేశ తాజా మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్ (తనను తాను దేశాధ్యక్షుడిగా ప్రకటించుకున్నారు) ప్రస్తుతం ఈ ప్రావిన్సులోనే ఉన్నారు. ట్వీట్లు చేయకుండా ఆయన్ను నిలువరించేందుకే అంతర్జాల సేవలను నిలిపివేసినట్లు సమాచారం.
ఇదీ చదవండి: అఫ్గాన్ విడిచి వెళ్లేందుకు.. 2వేల మంది జర్నలిస్టులు సిద్ధం!