అమెరికాకు చెందిన ఓ వ్యక్తికి కొన్ని వారాల క్రితం కైఫోప్లాస్టీ(kyphoplasty surgery) అనే శస్త్రచికిత్స జరిగింది. సాధారణ సర్జరీలకు, దీనికి చాలా వ్యత్యాసం ఉంది. కైఫోప్లాస్టీతో వెన్నెముక చికిత్స చేస్తారు. ఇందుకోసం ఓ ప్రత్యేక రకమైన సిమెంట్‌ను వెన్నెపూసలోకి ఇంజెక్ట్ చేస్తారు(kyphoplasty procedure).
ఆ 56 ఏళ్ల వ్యక్తికి శస్త్రచికిత్స చేసిన అనంతరం ఆయన శరీరం లోపల సిమెంట్ లీక్ అయ్యింది. అలా ప్రయాణిస్తూ, గుండె దగ్గర గట్టిపడి, అక్కడే నిలిచిపోయింది.
ఇవేవీ తెలియని వ్యక్తి కొద్ది రోజులు బాగానే ఉన్నాడు. కానీ వారం రోజుల తర్వాత ఛాతీలో నొప్పి మొదలైంది. ఊపిరి తీసుకోవడం కష్టమైంది. దీంతో వెంటనే వైద్యులను సంప్రదించాడు.
ఆసుపత్రిలో వైద్యులు స్కానింగ్ చేయగా.. ఈ విషయం బయటపడింది. గుండె దగ్గర ఓ కర్ర లాంటి ఆకారంలో 4 అంగుళాల సిమెంట్ ముక్క ఏర్పడింది. వెంటనే ఆ వ్యక్తిని సర్జరీకి తరలించారు. సిమెంట్‌ను తొలగించి, దెబ్బతిన్న భాగాలు, గుండెకు చికిత్స చేశారు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత ఆ వ్యక్తి కోలుకున్నట్టు తెలుస్తోంది.
కైఫోప్లాస్టీలో సిమెంట్ లీక్ అవ్వడం చాలా అరుదు. ప్రపంచవ్యాప్తంగా 2శాతం కన్నా తక్కువ కేసుల్లో ఇలా జరుగుతుందని అమెరికాలోని వైద్యులు వెల్లడించారు.
ఇదీ చూడండి:- అంతరిక్షంలో చనిపోతే ఏమవుతాం?