మలేరియాపై పోరులో కీలక ముందడగు. ప్రపంచంలోనే తొలిసారి అభివృద్ధి చేసిన మలేరియా టీకాను(Malaria Vaccine News) విస్తృత స్థాయిలో వినియోగించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)(Who On Malaria Vaccine) ఆమోదం తెలిపింది. మలేరియా వ్యాధి విజృంభణతో అల్లాడుతున్న ఆఫ్రికాలోని సబ్-సహారన్ ప్రాంతం సహా వ్యాధి ముప్పు అధికంగా ఉన్న ప్రాంతాల్లోని చిన్నారులకు ఈ టీకా వినియోగించవచ్చని స్పష్టం చేసింది.
ప్రాణాంతక వ్యాధి అయిన మలేరియాపై దశాబ్దాలుగా సాగుతున్న పోరాటంలో వ్యాక్సిన్(Malaria Vaccine News) విస్తృత వినియోగానికి ఆమోదం తెలిపిన రోజు 'చారిత్రక రోజు' అని డబ్ల్యూహెచ్ఓ(Who On Malaria Vaccine) అభిప్రాయపడింది. ఆర్టీఎస్, ఎస్ వ్యాక్సిన్ను మలేరియాను ఎదుర్కొనేందుకు వినియోగించాలని సూచించింది. డబ్ల్యూహెచ్ఓ పైలట్ ప్రాజెక్టుగా 2019 నుంచి ఘానా, కెన్యా, మాలవీలో ఈ టీకాలను వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆయా దేశాల్లో 8లక్షల మంది చిన్నారులకు ఈ టీకా పంపిణీ చేయగా.. సత్ఫలితాలు కనబరిచిందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది.
"సుదీర్ఘకాలంగా వేచి చూస్తున్న మలేరియా వ్యాక్సిన్ విస్తృత స్థాయిలో వినియోగానికి ఆమోదం పొందడం.. శాస్త్రీయ రంగంలో ఓ కొత్త మలుపు. చిన్నారుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు, మలేరియాను నియంత్రించేందుకు ఇది దోహదపడుతుంది. ఈ టీకా వినియోగం ద్వారా ఏటా లక్షలాది మంది చిన్నారుల ప్రాణాలను కాపాడవచ్చు."
-టెడ్రోస్ అథనోమ్, డబ్ల్యూహెచ్ఓ చీఫ్
గత రెండు దశాబ్దాలలో మలేరియాకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో ప్రపంచం 'అద్భుతమైన పురోగతి' సాధించిందని టెడ్రోస్ చెప్పారు. 2000 సంవత్సరం నుంచి మలేరియా మరణాలు సగం వరకు తగ్గాయని చెప్పారు. వివిధ దేశాల్లో మలేరియా మరణాలు లేవని పేర్కొన్నారు. అయితే.. మలేరియా టీకా వినియోగానికి(Malaria Vaccine News) పూర్తి స్థాయి అనుమతులు రానందున ఏటా 20 కోట్ల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారని టెడ్రోస్ చెప్పారు. ప్రాణాలు కోల్పోతున్న వారిలో వారిలో 2/3 వంతుల మంది.. ఆఫ్రికాలోని ఐదేళ్లలోపు చిన్నారులే అని పేర్కొన్నారు.
ఆఫ్రికాలో మలేరియా బారిన పడి ఏటా 2,60,000 మంది చిన్నారులు... ప్రాణాలు కోల్పోతున్నారని డబ్ల్యూహెచ్ఓ ఆఫ్రికా రీజనల్ డైరెక్టర్ మత్షిడిసో మేతి తెలిపారు. ఇప్పుడు ఈ టీకాలను వినియోగించడం ద్వారా చిన్నారుల ఆరోగ్యకరమైన పౌరులుగా ఎదుగుతారని చెప్పారు.
మలేరియా టీకాలను విస్తృతంగా వినియోగించేందుకు అంతర్జాతీయ సమాజం నుంచి నిధులు సేకరించడంపై తాము ఇక దృష్టి సారిస్తామని టెడ్రోస్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ వినియోగించాలా? వద్దా? అన్నదానిపై ఆయా దేశాలే నిర్ణయం తీసుకుంటాయని చెప్పారు.
ఇదీ చూడండి: విషజ్వరాల ముసురు.. ముందస్తు జాగ్రత్తలే విరుగుడు
ఇదీ చూడండి: Dengue fever: పంజా విసురుతున్న డెంగీ, మలేరియా.. ఆ జిల్లాల్లోనే అధికం!