ఆంగ్ల మాధ్యమం అంశంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బోబ్డే ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది విశ్వనాథన్ వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం ఆంగ్ల మాధ్యమం తీసుకొచ్చిందన్న విశ్వనాథన్.. ఒక సబ్జెక్టుగా తెలుగును కూడా ఉంచారని వివరించారు. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
అభివృద్ధి చెందిన దేశాల్లో ఆంగ్లంతోపాటు మాతృభాషలో బోధన కొనసాగుతుందని సీజేఐ తెలిపారు. 96 శాతం తల్లిదండ్రులు ఆంగ్లం కోరుకుంటున్నారని విశ్వనాథన్ అన్నారు. గణాంకాల ఆధారంగా ఈ విషయంలో నిర్ణయం తీసుకోలేమని సీజేఐ స్పష్టం చేశారు. తెలుగు కావాలనుకునే వారి కోసం మండల కేంద్రంలో పాఠశాల ఉంటుందన్న విశ్వనాథన్... ఉచిత బస్సు సర్వీసు సౌకర్యం కల్పిస్తున్నామని వాదనలు వినిపించారు.
ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండటం చాలా ముఖ్యమని సీజేఐ అభిప్రాయపడ్డారు. చిన్నారులకు పునాది బాల్యం... ఆ స్థాయిలో మాతృభాష విద్య ఉండాలని తెలిపారు. వేరే ధర్మాసనం నుంచి పిటిషన్ వచ్చినందున వచ్చే వారం వివరంగా విచారిస్తామని సీజేఐ పేర్కొన్నారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేశారు.
ఇదీ చదవండి: ప్రధాని మోదీతో ముగిసిన సీఎం జగన్ భేటీ.. ఆర్థిక, తాజా అంశాలపై చర్చ