కొవిడ్ మహమ్మారి తర్వాత సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారిపోయాయి. ఒక్కప్పుడు స్టార్ హీరోల సినిమాలకే ప్రాధాన్యమిచ్చే ప్రేక్షకులు ఇప్పుడు కంటెంట్ ఉండే చిన్న సినిమాలను చూసేందుకు మొగ్గు చూపిస్తున్నారు. దీంతో మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగా మన స్టార్ హీరోలు కూడా మారుతున్నారు. ఇది వరకు భారీ బడ్జెట్‌తో సినిమాలు తెరకెక్కించాలనే ఉద్దేశంతో ఉన్న హీరోలు సైతం అటు బడ్జెట్‌ను దృష్టిలోఉంచుకుని ఇటు కంటెంట్‌కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. అలా ప్రతి సినిమాకు డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో పని చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంతే కాకుండా పాన్ ఇండియా మూవీ ట్రెండ్ నడుస్తున్న ఈ కాలంలో ఇప్పటి వరకు రీజనల్ లెవెల్కే పరిమితం చేసిన తమ సినిమాలను పాన్ ఇండియా లెవెల్‌కు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. దర్శకులు సైతం ఓ వైపు తమ స్టైల్‌ను మార్చుకుంటూ మరో వైపు సినిమాలో కొత్తదనాన్ని తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
అయితే స్టార్ హీరోలను మెప్పించడం ఇప్పుడు డైరెక్టర్లకు పెద్ద టాస్క్‌గా మారిందట. ఓ కథను రెడీ చేసేందుకు ఎంతైతే కష్టపడుతున్నారో అంతకంటే ఎక్కువ ఎఫర్ట్‌తో హీరోలను మెప్పించేందుకు ప్రయత్నిస్తుంటారు. ఆ ప్రయత్నంలో కొన్ని సార్లు హీరోలకు కాన్సెప్ట్ అంతగా నచ్చకపోవచ్చు.. లేకుంటే స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తే నటించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పొచ్చు. దీంతో డైరెక్టర్లతో పాటు స్క్రిప్ట్ రైటర్లు.. కథలో మార్పులు చేర్పులు చేసేందుకు ఇంకాస్త సమయం తీసుకుంటారు. అలా ఎన్నో ప్రాజెక్టులు పట్టాలెక్కేందుకు ఆలస్యమైన సందర్భాలు ఉన్నాయి.
తాజాగా టాలీవుడ్లో అదే జరిగింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 16వ సినిమా కోసం జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరి ఓ కథను రెడీ చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ స్క్రిప్ట్‌ను చరణ్ రిజెక్ట్ చేశారట. ఆ తర్వాత రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఓ స్టోరీ వినిపించారట. ఆ స్టోరీ విజయ్‌కు బాగా నచ్చడంతో గౌతమ్ తిన్ననూరికి ఓకే చెప్పారట.
మరోవైపు కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ శిష్యుడు నార్తన్ కూడా దర్శకుడిగా మంచి పేరు సంపాదించారు. కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా హిట్ కొట్టడంతో ఇండస్ట్రీలో ఈయన పేరు మారుమోగిపోయింది. దీంత ఆయనకు మంచి డిమాండ్ ఏర్పడింది. అలా ఈ డైరెక్టర్ ఆర్సీ 16ను తెరకెక్కించేందుకు చరణ్‌తో చేతులు కలిపారట. కానీ ఈ డైరెక్టర్ కూడా ఆర్సీ 16కు దూరమైనట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నర్తన్ లిస్ట్‌లో విజయ్ దేవరకొండ కూడా ఉన్నారట. అయితే విజయ్‌తో కూడా ఈయన సినిమా తీయట్లేదని వార్తలు వచ్చాయి.
అప్‌కమింగ్ డైరెక్టర్స్‌కే కాదు స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ తిప్పలు తప్పట్లేదట. అంతా ఓకే అని స్టోరీ రెడీ చేసుకుని హీరోలకు కథ వినిపిస్తే.. కొంతమంది సుతిమెత్తంగా కథను తిరస్కరిస్తున్నారట. అయితే టాప్ డైరక్టర్స్‌ను రిజెక్ట్ చేయకూడదనో లేకుంటే స్టోరీ ఇంకాస్త మారిస్తే బాగుంటుందనో భావించే హీరోలు మాత్రం దర్శకులకు కథల్లో మార్పులు చేస్తే ఓకే చెప్తామని ఆఫర్లు ఇస్తున్నారట. దీంతో డైరెక్టర్లు కూడా హీరో ఓకే చెప్తే చాలు ఇక కథ పని మేము పడతాం అంటూ కసరత్తులు చేస్తున్నారట. అలా స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఫుష్ప ద రూల్స్ కోసం ఏడాది కష్టపడ్డారట.
సుకుమార్ లాగే కొరటాల శివ కూడా ఎన్టీఆర్ 30 కోసం దాదాపు సంవత్సరం పాటు వర్కౌట్ చేశారట. ఆచార్య ఫ్లాప్‌తో నిరాశ చెందిన కొరటాల.. ఇక సినిమాల విషయాల్లో జాగ్రతలు వహిస్తున్నారట. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌తో ప్లాన్ చేసిన తన అప్‌కమింగ్ మూవీ కోసం తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారట.