దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన అద్భుత దృశ్య కావ్యం 'ఆర్ఆర్ఆర్'. ఈ సినిమాతో హీరోలు ఎన్టీఆర్, రామ్‌చరణ్.. ప్రపంచవ్యాప్తంగా అభిమానాన్ని సంపాదించుకున్నారు. ఈ చిత్రానికి పలు అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి. ఈ మూవీలోని నాటు నాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ కూడా వరించింది. ఇప్పుడు ఆస్కార్ నామినేషన్ దక్కించుకుంది. కొద్దిరోజుల క్రితం.. ఆ సాంగ్‌కు కొరియోగ్రఫీ చేసిన డ్యాన్స్ మాస్టర్ ప్రేమ్ రక్షిత్ స్పందించారు.
"ఈ పాటను కొరియోగ్రఫీ చేసేముందు దర్శకుడు రాజమౌళి నాకొక మాట చెప్పారు. అదేంటంటే.. జూ.ఎన్టీఆర్ పులిలా ఉంటారని, రామ్ చరణ్ చిరుతలా ఉంటారని ఈ ఇద్దరు అగ్ర హీరోలు తెరపై కనిపించినప్పుడు ఆ హుక్ స్టెప్ ఓ గొప్ప ట్రేడ్‌మార్క్‌లా ఉండిపోవాలని తెలిపారు. వారిద్దరు కలిసి డ్యాన్స్ చేస్తున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌లపై దృష్టి మల్లించకుండా స్టెప్స్ ఉండాలని రాజమౌళి చెప్పారు. అందుకు రెండు నెలల కఠోర సాధన తర్వాత ఈ పాటను 20 రోజుల పాటు షూట్ చేశాము. ఆ ఫుట్‌ట్యాపింగ్ స్టెప్‌ను 100కుపైగా వేరియేషన్స్‌లో ట్రై చేశాము. చివరకు ఆ స్టెప్ ఫిక్స్ చేశారు. బాలీవుడ్ అగ్రతారల సినిమాల్లోని పాటలతో పోటీపడి నాటునాటు అవార్డు గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది." అని ప్రేమ్ రక్షిత్ తెలిపారు.
ఈ పాటను ప్రపంచం మొత్తం గుర్తించేలా చేసిన సోషల్ మీడియా యూజర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రేమ్ రక్షిత్. ఇన్‌స్టాగ్రామ్ వంటి మాధ్యమాల ద్వారా ఈ నాటు నాటు ఎంతో ప్రజాదరణ పొందిందని రక్షిత్ అన్నారు. ప్రస్తుతం తాను పుష్ప 2, తమిళ హీరో సూర్య సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోని పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నానని తెలిపారు.
ఆర్ఆర్ఆర్ ఒక యాక్షన్ డ్రామా మూవీ. గత ఏడాది మార్చిలో విడుదలైన ఈ చిత్రం ప్రపంచ బాక్సాఫీస్ వద్ద రూ.1,200 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. ఇక రక్షిత్ 1994లో బ్యాక్‌గ్రౌండ్ డ్యాన్సర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించారు. అయితే 2004లో రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన తెలుగు సినిమా విద్యార్ధితో ఆయన టాలీవుడ్‌కు పరిచయమయ్యారు.