విక్టరీ వెంకటేశ్ అభిమానుల కోరిక మేరకు డిసెంబర్ 13న ఒక రోజు నారప్ప చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేస్తున్నట్లు ఆ చిత్ర నిర్మాత సురేశ్ బాబు వెల్లడించారు. కరోనా కారణంగా నారప్పను థియేటర్ లో విడుదల చేయలేకపోయామని తెలిపిన సురేశ్ బాబు.... అమెజాన్ ఓటీటీ సంస్థను ఒప్పించి వెంకటేశ్ పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 13న నారప్పను విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఈ షో ద్వారా వచ్చే నగదును ఒక మంచి కార్యక్రమం కోసం ఉపయోగించనున్నట్లు సురేశ్ బాబు స్పష్టం చేశారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సురేశ్ ప్రొడక్షన్స్ లోనే వెంకటేశ్, రానా సినిమాలు నిర్మాణం జరుపుకుంటాయని సురేశ్ బాబు వెల్లడించారు.
దీంతో పాటే సంక్రాంతికి రిలీజయ్యే సినిమాలపై జరుగుతున్న వివాదం గురించి సురేశ్ మాట్లాడారు. నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా తనకున్న వెసులుబాటు ప్రకారం దిల్ రాజు తన చిత్రాన్ని ఎక్కువ థియేటర్ లో విడుదల చేసుకుంటున్నట్లు తెలిపారు. తమిళ నటుడు విజయ్ తో వారసుడు చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజు ఆ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదల చేయాలని భావించారు. అదే సంక్రాంతికి తెలుగులో చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృష్ణ వీరసింహారెడ్డి చిత్రాలు విడుదలవుతున్నందున థియేటర్ల సమస్య ఎదురైంది. ఈ విషయంపై చిత్ర పరిశ్రమలో తీవ్ర చర్చ కొనసాగుతున్న క్రమంలో నిర్మాత సురేష్ బాబు స్పందిస్తూ .... అనువాద చిత్రాల విడుదల నిరంతర సమస్యగా పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్, పుష్ప చిత్రాలకు తమిళనాడులో అత్యధిక థియేటర్లు కేటాయిస్తే అక్కడి హీరోలు ఫీలయ్యారని తెలిపారు. అప్పుడు తెలుగు హీరోలు, నిర్మాతలందరూ మౌనంగా ఉన్నారని పేర్కొన్నారు. బాహుబలి, పుష్ప లాంటి చిత్రాలు సినిమా సరిహద్దు చెరిపివేశాయని, కాంతార, కేజీఎఫ్ చిత్రాలు భారతీయ సినీ పరిశ్రమపై ఎంతో ప్రభావం చూపాయని తెలిపారు. భాషా ప్రాతిపదిక కాకుండా చివరకు మంచి సినిమానే మాట్లాడుతుందని, సంక్రాంతికి అన్ని సినిమాలు విడుదలై విజయం సాధిస్తాయని సురేష్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు.
"తెలుగు సినిమా హద్దులు చెరిగిపోయాయి. మన సినిమాను ఏ భాషలో కూడా చులకనగా చూడట్లేదు. చెన్నైలో ఆర్‌ఆర్‌ఆర్ విడుదల చేసినప్పుడు అక్కడి వాళ్లు కూడా ఇబ్బంది పడ్డారు. లోకల్‌గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. మంచి సినిమా అయితే.. ఎక్కువ థియేటర్స్‌లో ఆడిస్తారు. సినిమా బాగోకపోతే తర్వాతి రోజే తీసేస్తారు. ఇదొక బిజినెస్ అంతే. ఎవరిష్టం వారిది. ఆడుతుందనే నమ్మకం ఉన్న సినిమాకు ఎక్కువ థియేటర్స్ ఇస్తారు. అది ఏ భాష సినిమా అని ఎవరూ చూడరు. మన తెలుగు సినిమా కూడా ఇతర భాషల్లో విడుదలై విజయం సాధిస్తున్నాయి" అని అన్నారట.
ఇదీ చూడండి: హన్సిక సూఫీ నైట్ మూన్ లైట్లో జాన్వీ