Tollywood Young Heros Movies : కొన్నేళ్ల కిందటవరకూ సీనియర్లంటే మాస్ మసాలా కథలు, యువ కథానాయకులంటే ప్రేమకథలే. ఏ సినిమా చూసినా అవే కథలే అన్నట్టుగా ఉండేవి. పొరుగు పరిశ్రమలు కూడా ఆ విషయంలో మనల్ని వేలెత్తి చూపించేవి. క్రమంగా ఆ పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. యువతరం హీరోలు కొత్తదనంపై దృష్టిపెట్టారు. కొత్త ఆలోచనలతో వచ్చే దర్శకులకి ధైర్యంగా అవకాశాలు ఇచ్చారు. క్రమంగా సహజత్వంతో కూడిన కథలు వెలుగులోకి రావడం మొదలైంది. ఆ కథలకి యువ హీరోలు పట్టం కట్టడంతో అద్భుతాలే చోటు చేసుకున్నాయి. అంతకుముందు వరకు ఒక సినిమా హిట్ అయ్యిందంటే.. ఇక అందరూ అదే తరహా కథలతో ప్రయాణం చేసేవాళ్లు. కానీ యువ హీరోలు ఆ పద్ధతికి స్వప్తి పలికారు.
ఒకరు కాన్సెప్ట్ ఆధారంగా సాగే సినిమా చేస్తే, మరొకరు సహజత్వంతో కూడిన ప్రేమకథ చేయడం.. ఒకరు థ్రిల్లర్ చేస్తే, మరొకరు యాక్షన్ కథల్ని ఎంపిక చేసుకోవడం.. ఇలా ఒకొక్కరూ ఒక్కో రకమైన కథలతో ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. దాంతో యువ హీరోల సినిమాలపై కూడా.. అగ్ర తారల సినిమాల స్థాయిలో అంచనాల్ని పెంచుకోవడం అలవాటైంది. సినిమా బాగుందంటే ఆ స్థాయి వసూళ్లు కూడా దక్కుతుంటాయి. ఒకప్పుడు రూ.100 కోట్ల క్లబ్ అంటే ఆశ్చర్యంగా చూసేవాళ్లు. ఇప్పుడు యువ హీరో నిఖిల్ సినిమా కూడా ఆ రికార్డుని సొంతం చేసుకుంది. నాని, నాగచైతన్య, విజయ్ దేవరకొండ, నితిన్, రామ్, వరుణ్‌తేజ్, శర్వానంద్... తదితర కథానాయకుల కథల ఎంపికపై ట్రేడ్ వర్గాల్లో ప్రత్యేకమైన అంచనాలే ఉంటాయి. అయితే ఈమధ్య ఈ హీరోల్లో చాలామంది తమ కథలపై అంచనాల్ని తప్పేలా వరుసగా పరాజయాల్ని చవిచూస్తున్నారు.
'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి', 'గీతగోవిందం'... ఇలా వరస విజయాలతో విజయ్ దేవరకొండ పేరు మార్మోగిపోయింది. ఓటీటీ వేదికల ప్రభావంతో విజయ్‌కి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చింది. ఆయనకున్న ఇమేజ్, గుర్తింపు దృష్ట్యా పలు భాషల్ని లక్ష్యంగా చేసుకుని కథలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఆరంభంలో కథల ఎంపికతో అదరగొట్టిన విజయ్ లెక్క ఆ తర్వాత తప్పినట్టే అనిపిస్తోంది. 'నోటా', 'వరల్డ్ ఫేమస్ లవర్'... ఇలా వరుసగా వచ్చిన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించకుండానే వెళ్లిపోయాయి. 'లైగర్' విడుదల తర్వాత కూడా కథల ఎంపిక పరంగా విజయ్ పునరాలోచించుకోవల్సిందే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
'ఇష్క్', 'గుండెజారి గల్లంతయ్యిందే', 'అఆ' సినిమాలతో నితిన్ కూడా గాడిలో పడ్డారు. కానీ ఈమధ్య చేసిన 'చెక్', 'రంగ్ దే', 'మాచర్ల నియోజకవర్గం' తదితర సినిమాలు ఆయనకి పరాజయాల్నే మిగిల్చాయి. 'రెడ్', 'ది వారియర్' చిత్రాలతో మరో యువ కథానాయకుడు రామ్ కూడా పరాజయాల్నే చవిచూడాల్సి వచ్చింది. ఒకదానికొకటి సంబంధం లేకుండా కథలు చేస్తుంటారనే పేరున్న నాని లెక్కలు కూడా అప్పుడప్పుడూ తప్పుతూనే ఉన్నాయి. కథే కీలకమని నమ్మిన కథానాయకులు ఉన్నట్టుండి - ఇమేజ్, మాస్, పాన్ ఇండియా మార్కెట్ వంటి లెక్కల్ని దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేస్తుండటంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయనేది ట్రేడ్ పండితులు చెబుతున్న మాట.
నాగచైతన్య, వరుణ్‌తేజ్, శర్వానంద్ తదితర కథానాయకులు కూడా ఒకప్పుడు కథల ఎంపిక పరంగా శభాష్ అనిపించుకున్నవాళ్లే. కానీ ఈమధ్య అప్పుడప్పుడూ కథలపై వాళ్ల అంచనాలు తప్పుతున్నాయి. ఈమధ్య వరుణ్‌తేజ్ 'గని'తోనూ, నాగచైతన్య 'థ్యాంక్ యూ'తో పరాజయాల్ని చవిచూశారు. ఈ ఫలితాలు పునరావృతం కాకూడదంటే వాళ్లు కూడా కథల పరంగా మరిన్ని జాగ్రత్తలు తీసుకోవల్సిందే. 'మహాసముద్రం', 'ఆడవాళ్లు మీకు జోహార్లు'తో శర్వానంద్ కూడా వరుసగా పరాజయాల్ని ఎదుర్కొన్నారు.
'ఉప్పెన'తో విజయాన్ని అందుకున్న వైష్ణవ్‌తేజ్, ఆ వెంటనే పరాజయాన్ని చవిచూశారు. చేసిన ప్రతి సినిమా విజయం సాధిస్తుందని కాదు. ప్రేక్షకుల తిరస్కరణకి గురి కావడం వెనక చాలా కారణాలే ఉండొచ్చు. కానీ ఎక్కువ సినిమాలు కథల్లో కొత్తదనం లేకే పరాజయాన్ని చవిచూశాయి. అందుకే హీరోలు తొలి అడుగుల్లో కథలపై ఎంత శ్రద్ధ తీసుకున్నారో గుర్తు చేసుకోవాలనే అభిప్రాయాలు పరిశ్రమ నుంచి వినిపిస్తున్నాయి. దర్శకులు చెప్పే సింగిల్ లైన్ కథలు కాకుండా, పూర్తిస్థాయి స్క్రిప్టులు చదివి ఆ తర్వాత రంగంలోకి దిగాలనేది సినీ పెద్దలు చెబుతున్న మాట.
ఇవీ చదవండి: కోబ్రాలో పది వేరియేషన్స్ ఉంటాయి, కానీ ఆ విషయంలో చాలా బాధపడ్డా
కొత్త ఇల్లు కొన్న తమిళ స్టార్, ఖరీదు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే