ప్రతి డైరెక్టర్‌కు ఓ కలల ప్రాజెక్ట్ తప్పక ఉంటుంది. ఎప్పటికైనా ఆ ప్రాజెక్ట్‌ను తెరపైకి తీసుకురావాలని ఆశిస్తుంటారు ఆయా దర్శకులు. అలానే దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళికి కూడా ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ ఉందన్న సంగతి తెలిసిందే. అదే భారతీయ ఇతిహాసగాథ 'మహాభారతం'. ఎప్పటికైనా ఆ సినిమాను తెరపైకి తీసుకొస్తానని చాలా సందర్భాల్లో ఆయన చెప్పుకొచ్చారు. అయితే తాజాగా మరోసారి ఈ విషయాం గురించి మాట్లాడారు. అంతేకాదు, 'మహాభారతం'ను తాను రూపొందిస్తే.. పది భాగాలు ఉండొచ్చని అభిప్రాయపడ్డారు.
రీసెంట్గా ఓ కార్యక్రమంలో పాల్గొన్న జక్కన్నను ఓ వ్యక్తి ప్రశ్నిస్తూ "గతంలో మీరు 'మహాభారతం' తీస్తానని చెప్పారు. అద్భుతమైన ఆ దృశ్య కావ్యం టీవీలో 266 ఎపిసోడ్స్‌గా వచ్చింది. మీరు తీయాలనుకుంటే ఎన్ని భాగాలుగా తీస్తారు" అని అడగగా.. ఇందుకు రాజమౌళి సమాధానమిచ్చారు. "నాకు కూడా తెలియదు. ఇది చాలా కష్టమైన క్వశ్చన్. ఒకవేళ 'మహా భారతం' తీయాలంటే.. భారతదేశంలో అందుబాటులో ఉన్న అన్ని వెర్షన్స్ చదవాలి. అవి చదవడానికే ఏడాదిపైనే సమయం పట్టొచ్చు. అప్పటికి నేను ఒక్క అక్షరం కూడా పేపర్‌పై పెట్టలేకపోవచ్చు. చాలా పెద్ద ప్రాజెక్టు అది. ఒకవేళ 'మహాభారతం' తీస్తే పది భాగాలు తీయాల్సి వస్తుందేమో అని అనుకుంటున్నా. అయితే, ఎన్ని భాగాలు అవుతుందో కచ్చితంగా చెప్పలేకపోవచ్చు" అని జక్కన్న అన్నారు.
గతంలోనూ 'మహాభారతం' ప్రాజెక్ట్‌పై దర్శకుడు రాజమౌళి తన అభిప్రాయాన్ని తెలిపారు. "చాలా పెద్దగా ఆ ప్రాజెక్టు తెరకెక్కించాలి. భారతీయ కథలను ప్రపంచానికి చాటి చెప్పాలి. 'మహాభారతం' నా డ్రీమ్ ప్రాజెక్ట్. అయితే, ఆ మొదలుపెట్టేందుకు చాలా సమయం పడుతుంది. అంతకన్నా ముందు నాలుగైదు సినిమాలు తీసే అవకాశముంది" అని పేర్కొన్నారు.
కాగా, ఆర్‌ఆర్‌ఆర్‌తో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్న జక్కన్న.. తెలుగు సినిమా ఖ్యాతిని 'ఆస్కార్' వరకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.1200 కోట్లకు పైగా వసూళ్లను అందుకుంది. ప్రస్తుతం జక్కన్న.. సూపర్‌స్టార్ మహేశ్‌బాబుతో కలిసి సినిమా చేసేందుకు రెడీ అవుతన్నారు. స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ ఏడాది చివరిలో కానీ, వచ్చే ఏడాది ప్రథమార్ధంలో కానీ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది చిత్రబృందం తెలిపింది! రాజమౌళి తండ్రి, ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ ఈ సినిమాకు కథ అందిస్తున్నారు.
ఇదీ చూడండి: Adipurush trailer : రావణుడికి నో స్పేస్.. ప్రభాస్ డైలాగ్ సేమ్ అదే ఫీలింగ్