హోరాపోరీ పోరు జరుగుతున్న సమరాంధ్ర ఎన్నికల్లో పాలు పంచుకునేందుకు పెద్ద ఎత్తున ప్రవాసాంధ్రులు ఆసక్తి చూపారు. ప్రవాసాంధ్రులు ఓటు వేసేందుకు ఫాం 6కు ద్వారా అవకాశం కల్పించింది ఈసీ. 5వేల323 మంది ఎన్ఆర్ఐలు ఈసారి ఎన్నికల్లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వారు ఆన్ లైన్ ద్వారా ఓటు వేయొచ్చంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతుల్ని మాత్రం ఈసీ ఖండిస్తోంది. ఒరిజినల్ పాస్ పోర్టుతో నిర్దేశించిన పోలింగ్ స్టేషన్లో ఓటు వేయొచ్చని స్పష్టం చేస్తోంది.
సంఖ్య పెరిగింది..
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేసేందుకు ఎన్ఆర్ఐలూ దరఖాస్తులు చేసుకున్నారు. ఎన్నికల సంఘం విడుదల చేసిన తుది జాబితా తర్వాత రాష్ట్రంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు అర్హత సాధించిన ఎన్ఆర్ఐ ఓటర్ల సంఖ్య 5 వేల 323గా తేలింది. 2014 ఎన్నికలతో పోలిస్తే ఈ సంఖ్య రెండింతలు పెరిగినట్టు ఎన్నికల సంఘం చెబుతోంది. 2019 జనవరి 11 తేదీన విడుదలైన జాబితాలో ఎన్ఆర్ఐ ఓటర్లు 2 వేల 520గానే నమోదు అయ్యింది. అయితే తాజాగా ఈసీ ప్రకటించిన అనుబంధ జాబితా తర్వాత వీరి సంఖ్య రెట్టింపయింది.
అధికంగా కడప నుంచే...
అమెరికా, ఆస్ట్రేలియా, లండన్, జర్మనీ, సింగపూర్ తదితర దేశాల నుంచి ఎన్ఆర్ఐలు ఫాం 6 ఏల ద్వారా ఈసీకి దరఖాస్తులు చేశారు. వీరిలో ఎక్కువ మంది కడప జిల్లాలో తమ ఓటును నమోదు చేసుకున్నారు. 1,068 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు కడప నుంచే ఓటు వేయనున్నారు. అటు గుంటూరులో 879, కృష్ణా జిల్లాల్లో 839గా నమోదు అయ్యారు. కనిష్టంగా శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో 48 మంది చొప్పున ఓటు నమోదు చేసుకున్నారు. పశ్చిమ గోదావరిలో 587 మంది, తూర్పు గోదావరిలో 509 మంది, విశాఖలో 394 మంది, ప్రకాశం జిల్లాలో 324 మంది, నెల్లూరులో 203 మంది, కర్నూలులో 104 మంది, చిత్తూరులో 261 మంది ఎన్ఆర్ఐలు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. విజయనగరంలోనూ 59 మంది ప్రవాసాంధ్ర ఓటర్లున్నారు. అన్ని ప్రాంతాల్లోని ఓటర్లను ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు అన్ని ప్రయత్నాలు చేశాయి. మరి ఫారిన్ ఓటర్ల ప్రేమ ఎవరిపై ఉందో...!