తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరగడం లేదని మనస్తాపానికి గురై సునీల్ నాయక్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన జరిగిన నాలుగో రోజునే మరో యువకుడు ఉద్యోగం రాలేదని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం వట్టిమల్లకు చెందిన ముచ్చర్ల కొమురయ్య, రామవ్వల చిన్న కుమారుడు మహేందర్ యాదవ్ (30) కరీంనగర్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొని విద్యార్థి నాయకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణ యాదవ విద్యార్థి ఫెడరేషన్ వ్యవస్థాపకునిగా కొనసాగుతున్నాడు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక.. స్నేహితులతో హైదరాబాద్‌కు వెళ్లిన మహేందర్ అక్కడే దూరవిద్యలో బీఎస్సీ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగాన్వేషణతో పాటు ప్రభుత్వ విభాగాల్లోనూ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నాడు. వారం క్రితం బీరప్ప ఉత్సవాల సందర్భంగా సొంతూరుకు వచ్చాడు. కుటుంబ సభ్యులు పెళ్లి విషయం ప్రస్తావించగా ఉద్యోగం లేకుండా ఎలాగంటూ వేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం గ్రామ శివారులోని మంచినీటి బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మహేందర్ కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు వెతకగా బావిలో అతడి శవం దొరికింది.