ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక.. ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి యత్నించిన మహిళను అనంతపురం పోలీసులు రక్షించారు. పిల్లలతో కలిసి రైలు పట్టాలపై నిల్చునేందుకు సిద్ధమవుతుండగా గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారమిచ్చారు. వెంటనే సకాలంలో స్పందించిన పోలీసులు అక్కడకు చేరుకుని వారిని కాపాడారు. అనంతరం తల్లికి కౌన్సెలింగ్ ఇచ్చి.. మహిళా హోంకు తరలించారు.
రోడ్డు ప్రమాదంలో భర్తకు గాయాలవడంతో..
మంత్రాలయానికి చెందిన కుమారి తన భర్తతో కలిసి కూలిపని చేస్తూ జీవనం సాగిస్తుంది. కొన్నేళ్ల క్రితం జరిగిన రోడ్డు ప్రమాదంలో భర్త రెండు కాళ్లు దెబ్బతిన్నాయి. దీంతో ఉపాధి లేక వారికి పూట గడవడమే కష్టంగా మారింది. ఆకలి మంటలు వెంటాడటం ప్రారంభించాయి. చివరికి.. పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుంది. ఇందుకోసం అనంతపురం పట్టణంలోని రైల్వే బ్రిడ్జి దగ్గరకు చేరుకుంది.
అందరం కలిసి రైలు పట్టాలపై నిల్చోవాలని.. పిల్లలకు వివరిస్తుండగా గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వేగంగా స్పందించి ఆమెతో పాటు ముగ్గురు పిల్లల ప్రాణాలు కాపాడారు. పోలీసులకు సమాచారం అందించిన రామకృష్ణ అనే వ్యక్తిని డీఎస్పీ వీరరాఘవ రెడ్డి అభినందించారు. సమాచారం అందిన వెంటనే అప్రమత్తమైన ఎస్సై రాఘవరెడ్డితో పాటు ఇతర సిబ్బందిని రెండో పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ జాకీర్ హుస్సేన్ ప్రశంసించారు.
ఇదీ చదవండి: