Woman Suicide Attempt At CM Camp Office : తాడేపల్లిలోని సీఎం జగన్ కార్యాలయం సమీపంలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేయడం కలకలం రేపింది. స్థానికులు హుటాహుటిన ఆమెను విజయవాడ జీజీహెచ్‌కి తరలించారు. చికిత్స అందిస్తున్న వైద్యులు మణికట్టు వద్ద ఐదు కుట్లు వేశారు. తల్లి అపస్మారక స్థితికి చేరడాన్ని చూసిన కుమార్తె ….కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ముఖ్యమంత్రిని కార్యాలయం వద్ద తనకు న్యాయం జరగలేదనే ఆందోళనతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు.
వెన్నెముక సమస్యతో చక్రాల కుర్చీకే పరిమితమైన తన కుమార్తె శస్త్రచికిత్స కోసం.. ఆస్తులు అమ్ముకుందామంటే కొందరు అడ్డుపడుతున్నారంటూ సీఎంవో కార్యాలయానికి వచ్చిన మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. రెండ్రోజులుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా సీఎంను కలిసేందుకు పోలీసులు నిరాకరించడంతో మనస్తాపానికి గురైన కాకినాడకు చెందిన ఆరుద్ర అనే మహిళా మణికట్టును బ్లేడుతో కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది భాదితురాలను హుటాహుటిన విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు చికిత్స అందిస్తున్నారు. తెగిన చోట 5 కుట్లు వేశారు. మణికట్టు వద్ద నరాలు ఏమైనా తెగాయా అని తెలుసుకొనేందుకు ఎక్స్‌రే తీశారు. ప్రస్తుతం ఆమెకు వైద్య చికిత్స అందిస్తున్నారు. తల్లి అపస్మారక స్థితిలో ఉండడంతో ఆమె కుమార్తె సాయి లక్ష్మీ చంద్ర కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. ఒక వైపు వెన్నెముక సమస్యతో భాదపడుతూ.. మరో వైపు తన తల్లి ఈ స్థితిలో ఉండడంతో యువతి ఉక్కిరిబిక్కిరి అయిపోయింది.
ఆత్మహత్యాయత్నానికి ముందు ఆరుద్రా మీడియాతో గోడు వెళ్లబోసుకున్నారు. తనకు జరిగిన అన్యాయాన్ని చెప్పుకుందామని వస్తే పోలీసులు అనుమతించడం లేదని వాపోయారు. రెండ్రోజుల నుంచి సీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోలేదని.. అందుకే ఆందోళనతో తమ సోదరి ఆత్మహత్యాయత్నం చేసినట్లు ఆమె సోదరుడు ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఘాటుగా స్పందించారు. పబ్లిసిటీకే పరిమితమైన స్పందన కార్యక్రమం ఎందుకని ప్రశ్నించారు. సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళను ఆదుకోవాలన్నారు. ఘటన కలచి వేసిందన్న చంద్రబాబు.. కూతురి వైద్యానికి తన ఇంటిని అమ్ముకునే స్వేచ్ఛ కూడా ఆమెకు లేకుండా చేయడం దారుణమని మండిపడ్డారు. దీనికి కారణమైన మంత్రి గన్‌మెన్‌పై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తనకు న్యాయం చేయమని గతంలో కాకినాడ కలెక్టరేట్ ముందు ఆరుద్ర ధర్నా చేసినప్పుడే ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ఇంతవరకు వచ్చేదా అని ప్రశ్నించారు.
ప్రజలను కలవాలంటే ఈ ముఖ్యమంత్రికి అహంకారం అడ్డొస్తుందా నారా లోకేశ్ దుయ్యబట్టారు. సొంత తల్లి, చెల్లిని తరిమేసిన జగన్ పాలనలో .. సామాన్య మహిళల కష్టాలు తీరుతాయనుకోవడం అత్యాశేనని ధ్వజమెత్తారు. గోడు చెప్పుకునే అవకాశం లేనప్పుడు జగనన్నకు చెప్పుకుందాం పేరిట కొత్త కార్యక్రమం దేని కోసమని తెలుగు మహిళా అధ్యక్షురాలు అనిత ప్రశ్నించారు. వరుస ఘటనలకు జగన్ సమాధానమేంటని నిలదీశారు.
కుమార్తె కోసం ఇల్లు అమ్మి చికిత్స చేద్దామంటే మంత్రి గన్‌మెన్ అడ్డుపడుతున్నారు. గన్‌మెన్ల దౌర్జన్యంపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎవరినీ ఇల్లు కొననీయకుండా అడ్డుపడుతున్నారు. సీఎంను కలవాలంటే ఎమ్మెల్యేతో రావాలని అధికారులు చెప్పారు. సమస్య పరిష్కారానికి ఎన్ని దిక్కులు పరిగెత్తాలి. ఇంటి సమస్య పరిష్కరిస్తామని సీఎంవో అధికారులు చెప్పారు. మూడున్నరేళ్లుగా ఎదుర్కొన్న వేధింపులపై జవాబివ్వలేదు. చికిత్సకయ్యే ఖర్చులో 20 నుంచి 30 శాతమే ఇస్తామంటున్నారు. చికిత్సకు సాయం చేయక, ఆస్తినీ అమ్ముకోనీయకపోతే ఎలా? నా కుమార్తెను బతికించుకోవాలంటే రూ.2 కోట్లు ఖర్చవుతుంది.-ఆరుద్ర, బాధిత మహిళ
ఇవీ చదవండి: