Wife strangled husband to death in peddapalli : తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ ఆటోనగర్‌లో సెంట్రింగ్ పనులు చేస్తూ ఆటోనగర్‌లో నివసిస్తున్న అజీంఖాన్(33) అదే కాలనీకి చెందిన శ్రావణిని 2015లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్నవారు అత్త నర్మద (శ్రావణి తల్లి) ఇంట్లోనే నివసిస్తున్నారు. కుమారులు హమాన్(6), హర్మాన్(8)లను పాఠశాలకు పంపించి శ్రావణి కృష్ణానగర్‌లోని ఓ సంస్థలో పనికి వెళ్తోంది. ఆమె రోజూ ఫోన్లో మాట్లాడుతూ పనికి వెళ్తుండటాన్ని గమనించిన అజీంఖాన్ అనుమానం పెంచుకున్నాడు. ప్రవర్తన మార్చుకోవాలని హెచ్చరించాడు. దీనిపై మంగళవారం సాయంత్రం ఇంటి బయటే భార్య, అత్త అతడితో గొడవకు దిగారు.
అనంతరం శ్రావణి, నర్మదలు ఇద్దరూ అతన్ని ఇంట్లోకి లాక్కెళ్లి గొంతు నులిమేయడంతో కిందపడి పోయాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించగా, వారు వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు చెప్పారు. మృతుని సోదరుడు నదీమ్‌ఖాన్ ఫిర్యాదు మేరకు భార్య, అత్తపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎన్టీపీసీ ఎస్సై బి.జీవన్ తెలిపారు.