Gun Fire on Reporter: అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో ఓ టీవీ ఛానల్ విలేకరిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పీలేరులో పనిచేస్తున్న పర్వత రెడ్డి (45) గత నెల 31వ తేదీ సాయంత్రం ఐదున్నర గంటలకు చిత్తూరు నుంచి బయలుదేరి రాయచోటికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. శివాలయం కూడలి వద్దకు రాగానే గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పర్వత రెడ్డి తీవ్రంగా గాయపడినట్లు పట్టణ సీఐ సుధాకర్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే ప్రమాదం జరిగిన విషయం గుర్తించిన స్థానికులు అతడిని ఆస్పత్రికి తరలించారు. వాహనాల టైర్ల కింది నుంచి ఓ రాయి వచ్చి తగలడం వల్లే రక్తస్రావం జరిగిందని అంతా భావించారు. స్థానికులు కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లగా.. పర్వత రెడ్డిని పరిశీలించిన వైద్యులు.. అతడి శరీరంలో బుల్లెట్ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే మెరుగైన చికిత్స నిమిత్తం వెంటనే అతడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించడంతో.. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స ద్వారా బుల్లెట్‌ను వెలికి తీశారని సీఐ వెల్లడించారు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాల్పులు జరిపిన వారి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అయితే బాధితుడు పర్వత రెడ్డికి, వారి బంధువులకు మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్లు విచారణలో గుర్తించినట్లు పోలీసులు పేర్కొన్నారు. కాగా విలేకరిపై కాల్పులు జరిపిన నిందితులను త్వరగా పట్టుకొని కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పాత్రికేయ సంఘాల నాయకులు శుక్రవారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుకు విజ్ఞప్తి పత్రం అందజేశారు.
ఇవీ చదవండి: