పాల బుగ్గల చిన్నారులు.. లోకం తెలియని ‘పసి’డి మొగ్గలు.. కవలలు.. రిక్కె వేస్తే చాలు.. బోసినవ్వులతో వసంతాన్ని తెస్తారు. పలకరిస్తే చాలు.. పండగని తెస్తారు. అలాంటి పసిమొగ్గలకు పది నెలలకే వందేళ్లు నిండిపోయాయి. కారకులు ఎవరైనా.. కారణం ఏదైనా.. ఇద్దరు కవల పిల్లలు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. ఈ హృదయ విదారక సంఘటన మనుబోలు మండలంలోని వీరంపల్లి పంచాయతీ రాజవోలుపాడు ఎస్సీ కాలనీలో ఆదివారం జరగ్గా.. సోమవారం వెలుగు చూసింది.
ఎస్సీ కాలనీకి చెందిన పుట్టా వెంకటరమణయ్య, బాలాయపల్లి మండలంలోని వెంగమాంబపురానికి చెందిన నగిరిపాటి నాగరత్నమ్మ 2019లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అది వెంకటరమణయ్య ఇంట్లోని పెద్దలకు ఇష్టం లేకపోవడంతో తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఆ క్రమంలోనే గర్భం దాల్చిన తర్వాత.. నాగరత్నమ్మ పుట్టింటికి వెళ్లారు. పది నెలల కిందట కవలలకు జన్మనిచ్చారు. ఇద్దరు ఆడపిల్లలు పుట్టారని బంధువులు వెంకటరమణయ్యకు తెలపగా.. తనకు పిల్లలతో సంబంధం లేదని, ఏమైనా చేసుకోమని సమాధానం ఇచ్చారు. దాంతో నాగరత్నమ్మ.. ఆమె కుటుంబ సభ్యులు బాలాయపల్లి పోలీసుసేషన్‌లో ఫిర్యాదు చేయగా.. భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అలా గ్రామంలో వేరుకాపురం పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఆ నేపథ్యంలోనే గత గురువారం పిల్లలతో కలిసి కాలనీలో కొత్తగా నిర్మించుకున్న పూరింట్లో చేరారు. ఆదివారం మధ్యాహ్నం నాగరత్నమ్మ పాలు కాచి డబ్బాలో పోసి భర్తకు ఇవ్వగా.. ఇద్దరు బిడ్డలకు తాగించారు. వెంకటరమణయ్య తల్లి ఊరి నుంచి ఇంటికి వచ్ఛి. పిల్లలను చూడాలని చెప్పడంతో తీసుకెళ్లి చూపించి తీసుకొచ్చాడు. ఆ తర్వాత కొంత సేపటికి బిడ్డలు ఏడవగా సముదాయించే క్రమంలో అస్వస్థతకు గురైనట్లు గుర్తించారు. వీరంపల్లిలోని ఆర్‌ఎంపీ వద్దకు తీసుకువెళ్లగా పరీక్షించి నెల్లూరుకు తీసుకువెళ్లాలని చెప్పారు. 108 వాహనంలో నెల్లూరులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా.. అక్కడి వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించడంతో గ్రామానికి తీసుకొచ్చారు.
సోమవారం ఉదయం విషయం తెలిసి గూడూరు గ్రామీణ వలయాధికారి శ్రీనివాసరెడ్డి, మనుబోలు ఎస్సై ముత్యాలరావు, చిల్లకూరు ఎస్సై సుధాకర్‌రెడ్డి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం గూడూరు ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా, చిన్నారుల మృతిపై ఇరువర్గాల బంధువులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.
పాల డబ్బా, పొడి స్వాధీనం
చిన్నారులకు పాలు తాగించిన డబ్బాను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరిశీలనలో అది నీలి రంగులో ఉండటాన్ని గుర్తించారు. అలాగే, వెంకటరమణమ్మ, నాగరత్నమ్మ కాపురం ఉంటున్న ఇంటి పరిసరాల్లో నీలం రంగులోని పొడిని స్వాధీనం చేసుకున్నారు. రంగు మారిన పాలు, నీలం రంగులోని పొడి, చనిపోయిన చిన్నారుల చేయి, కాళ్ల గోళ్లు, పాదాలు నీల రంగులో ఉండడంతో విషం వల్లే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.
ఇదీ చదవండి: