Crime News: రాష్ట్రంలో జరిగిన వేర్వేరు ఘటనల్లో ముగ్గురు మృతి చెందారు. అప్పుల భారం మోయలేక ప్రకాశం జిల్లాలో ఓ యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు. బల్లికురవ మండలం ఉప్పుమాగులూరుకు చెందిన బొంత వేణుబాబుకు.. ఎకరం పొలం ఉంది. మరో 5ఎకరాలు కౌలుకు తీసుకుని పత్తి, మిరప పంటలు సాగు చేశాడు. రెండేళ్లుగా కాలం కలిసిరాక చేసిన అప్పులు వడ్డీలతో కలిపి రూ. 6 లక్షలకు పెరిగాయి. తీర్చే మార్గం కనిపించక 2రోజుల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయన్ను చిలకలూరిపేట ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందాడు. వేణుబాబు సోదరుడి ఫిర్యాదుతో బల్లికురవ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు.
తిరువూరు బస్టాండ్‌లో దారుణ హత్య..
కృష్ణా జిల్లా తిరువూరు బస్టాండ్ సెంటర్లో ఓ యువకుడిని.. గుర్తుతెలియని వ్యక్తులు బండరాయితో మోది దారుణంగా హత్య చేశారు. హత్యకు గురైన యువకుడిని మల్లకుంట శ్రీను కుమారుడు కృష్ణచైతన్యగా గుర్తించారు. తిరువూరు బస్టాండ్ క్యాంటీన్లో కృష్ణచైతన్య పని చేసేవాడు. బస్టాండ్ వద్ద జరిగిన పలు ఘర్షణల్లో నిందితుడిగా ఉన్నాడు. పాతకక్షలే హత్యకు కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదుచేసి విచారణ చేపట్టారు.
హత్యాయత్నానికి కారణమైన వివాహేతర సంబంధం..
కడపలో వివాహేతర సంబంధం మహిళపై హత్యాయత్నానికి కారణమైంది. ఆటో నగర్‌కు చెందిన మల్లెల నారాయణ ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఇతనికి భార్య పిల్లలు ఉన్నారు. ఇటీవల బసిరున్నీస అనే మహిళతో నారాయణకు వివాహేతర సంబంధం ఏర్పడింది. మల్లెల నారాయణ బసిరున్నీస పేరిట రూ. 40 వేలు వెచ్చించి రాజీవ్ గృహకల్పలో ఇంటిని కొనుగోలు చేశాడు. ఆ ఇంటి విషయమై మాట్లాడేందుకు మల్లెల నారాయణ నిన్న రాత్రి బసిరున్నీసను వెంటబెట్టుకుని రాజీవ్ గృహకల్పకు వెళ్లారు. మల్లెల నారాయణ భార్యకు బసిరున్నీస చేతబడి చేసిందనే అనుమానంతో ఆమెను ప్రశ్నించాడు. దీంతో వారి మధ్య మాటా మాటా పెరిగింది. కోపోద్రిక్తుడైన నారాయణ తన వద్ద ఉన్న కత్తితో బసిరున్నీస కడుపు పైన, వీపుపై పొడవడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. మల్లెల నారాయణను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
అనుమానాస్పద స్థితిలో ఆటో డ్రైవర్ మృతి..
ఆటో డ్రైవర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన అనంతపురం జిల్లా కదిరిలో జరిగింది. నిజాంవలి కాలనీలో నివాసముండే ఆటో డ్రైవర్ నరసింహులు గజ్జలరెడ్డి పల్లి వద్ద ఉన్న పెట్రోల్ బంకు సమీపంలో అచేతనంగా పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు గుర్తించారు. వెంటనే కుటుంబ సభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. నరసింహులు భార్య ఉపాధి కోసం సౌదీకి వలస వెళ్లారు. దీంతో ముగ్గురు పిల్లలతో కలిసి నరసింహులు నిజాంవలికాలనీలో నివాసం ఉంటున్నాడు. బుధవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిన నరసింహులు గురువారం తెల్లవారుజామున మృతి చెందినట్లు తెలియడంతో ఆయన తల్లి ముగ్గురు పిల్లలు బోరున విలపించారు. నరసింహులు ప్రమాదవశాత్తు మృతి చెందాడా..? లేక మరేదైనా కారణముందా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో చోరి...
కృష్ణాజిల్లా వీరులపాడు మండలం అల్లూరు సెంట్రల్ బ్యాంక్ అఫ్ ఇండియాలో చోరీ జరిగింది. గత అర్ధరాత్రి బ్యాంకు వెనుక భాగంలో ఉన్న కిటికీ గ్రిల్ తొలగించి బ్యాంకు లో దొంగతనానికి పాల్పడినట్లు మేనేజర్ సాంబయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎస్సై సోమేశ్వరరావు బ్యాంకుకు చేరుకుని సీసీటివి ఫుటేజ్ ను పరిశీలించారు.
తల్లి ఫోనే ఎత్తలేదని..
కన్నతల్లి తన ఫోన్ ఎత్తలేదని.. తిరిగి ఫోన్ చేయలేదనే క్షణికావేశంలో ఓ యువతి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు గ్రామంలో జరిగింది ఎస్ఐ సత్యనారాయణ కథనం ప్రకారం.. భట్టిప్రోలుకు చెందిన సునీత తన భర్త చనిపోవడంతో కుమార్తె అంజలితో కలిసి తెనాలిలో నివాసం ఉంటుంది. అంజలి నారాకోడూరుకు చెందిన నాని అనే యువకుడితో ప్రేమలో పడింది రెండు నెలల గర్భిణి అని తెలియడంతో తల్లి సునీత నానికి ఇచ్చి 5 నెలల క్రితం వివాహం జరిపించింది.
ప్రస్తుతం ఏడు నెలల గర్భవతి ఈనెల 18వ తేదీన అంజలి కెనాల్లో ఉంటున్న తన తల్లి సునీత కు ఫోన్ చేసింది సునీత ఫోన్ ఎత్తకపోవడంతో మనస్తాపానికి గురైంది. ఈనెల 20వ తేదీన ఇంట్లో ఎవరికీ తెలియకుండా కలుపు నివారణ మందు తాగింది. వెంటనే ఆమెను గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందింది.
వడ్డీకి డబ్బులు తీసుకోని మోసం చేశారని ధర్నా..
వడ్డీకి డబ్బులు తీసుకుని మోసం చేశారంటూ... గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో రైతులు ఆందోళన చేపట్టారు. గుంటూరు-ప్రత్తిపాడు రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. తిరుమల ఎంటర్ ప్రైజస్ దుకాణ యజమాని అనపరెడ్డి నాగిరెడ్డి , అతని గుమస్తా నాగరాజులు 8 గ్రామాలకు చెందిన దాదాపు 250 మంది రైతుల పైగా సుమారు రూ. 38 కోట్లు వరకు వడ్డీకి నగదు తీసుకుని పరారు అవడంతో రైతులు ఆందోళనకు దిగారు. రహదారి పై బైఠాయించి ధర్నా చేయడంతో రవాణాకు అంతరాయం కలిగింది.
గంజాయి అమ్ముతున్న నలుగురు అరెస్టు...
అక్రమ మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఏజెన్సీ ప్రాంతాల నుంచి గంజాయి తీసుకువచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు గా తయారుచేసి విద్యార్థులకు అమ్ముతున్న నలుగురు యువకులను గుంటూరు జిల్లా పెదకాకాని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 160 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
బస్సు, ద్వీచక్ర వాహనం ఢీ...ఇద్దరు మృతి
ప్రకాశం జిల్లా పామూరు మండలం బుక్కాపురం గ్రామ సమీపంలో ఓ పాఠశాల బస్సు, ద్విచక్ర వాహనం ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న ఇరువురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. మృతులు నెల్లూరు జిల్లా కావలి కి చెందిన కంచి విజయభాస్కర్ రెడ్డి (35),వరలక్ష్మమ్మ(35)లు గా పోలీసులు గుర్తించారు.
క్రికెట్ బ్యాట్ తో మహిళ పై దాడి...
చీరాల మున్సిపాలిటీ 33 వార్డు మహిళా కౌన్సిలర్ గుండాల సలోమిపై ఒక వ్యక్తి దాడిచేశాడు. సురేష్ అనే వ్యక్తి క్రికెట్ బ్యాట్‌తో ఆమెపై దాడి చేయగా సలోమీ తీవ్రంగా గాయపడింది.. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బ్యాంకు ఉద్యోగిని ఆత్మహత్య...
టంగుటూరులో బ్యాంక్ ఉద్యోగిని ఆత్మహత్య కు పాల్పడింది... స్థానిక సిండికేట్ బాంక్ కో ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న ఐశ్వర్య రణదీప్ తను అద్దెకు ఉంటున్నా గది లో ఫ్యాన్ కు ఉరి చేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఆమెది మహారాష్ట్ర లో సోలాపూర్.
ఆటో బోల్తా..నలుగురికి గాయాలు...
ప్రకాశం జిల్లా, గిద్దలూరు పట్టణంలోని అమరావతి -అనంతపురం జాతీయ రహదారి పై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయాలపాలయ్యారు. గాయపడ్డ వారిని 108 వాహనంలో గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఉరివేసుకోని విద్యార్థి ఆత్మహత్య...
పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం వీవర్స్ కాలనీ కి చెందిన 8 వ తరగతి విద్యార్థి గుమ్మడి హేమంత్(12) ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.స్కూల్ ప్రధానోపాధ్యాయుడు మందలించాడని ఆత్మహత్య చేసుకున్నాడని బంధువులు ఆరోపిస్తున్నారు అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
మట్కా నిర్వహకులు అరెస్టు...
అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్, బొమ్మనహల్, డిహిరేహాల్, గుమ్మగట్ట మండలాల్లో కళ్యాణదుర్గం ఇంఛార్జి డీఎస్పీ యు.నరసింగప్ప ఆధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. 23 మంది మట్కా నిర్వాహకులను అరెస్టు చేశారు. వారి నుంచి 16 సెల్ ఫోన్లు, మట్కా పట్టీలు, ఇతర సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు.
కర్నూలులో అగ్ని ప్రమాదం...
కర్నూలు నగరంలోని వీకర్ సెక్షన్ కాలనీలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సుందరయ్య పార్కులో నగర పాలక సంస్థకు చెందిన పైపులను గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. పైపులు పెద్ద సంఖ్యలో ఉండడంతో మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడ్డాయి.
ఇదీ చదవండి: YS Viveka Case: వైఎస్ వివేకా కేసు.. వాచ్‌మ్యాన్ రంగన్న ఇచ్చిన వాంగ్మూలంలో విస్తుపోయే నిజాలు