Bhavani suicide case: కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలంలోని చల్లపల్లి పంచాయతీ కార్యదర్శి రొడ్డా భవాని జులై 7న ఆత్మహత్యకు పాల్పడిన ఘటనకు సంబంధించిన కేసు పలు మలుపులు తిరిగి చివరకు కొలిక్కి వచ్చింది. ఆదివారం ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి విలేకరులకు ఈ వివరాలను వెల్లడించారు. భవాని కుటుంబ సభ్యుల భిన్న సమాధానాలు, కాల్ రికార్డింగ్, వాట్సప్ చాటింగ్‌లను చూపించారు.
ఇదీ చూడండి: మహిళా పంచాయతీ కార్యదర్శి ఆత్మహత్య
‘ఈ ఘటనలో 306, 384 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి డీఎస్పీ మాధవరెడ్డి సమగ్ర విచారణ జరిపారు. సర్పంచిగా పోటీ చేసి ఓడిపోయిన మహిళ భర్త, వైకాపా నాయకుడు వరసాల సత్యనారాయణ రూ.32వేలు, వార్డు సభ్యురాలి భర్త ముత్తాబత్తుల సూరిబాబు, 14వ వార్డు సభ్యుడు యర్రంశెట్టి నాగరాజు చెరో రూ.10వేలు ఒత్తిడి చేసి భవానీవద్ద తీసుకున్నట్లు రుజువైంది. వారు ముగ్గురినీ అరెస్టు చేశాం. తాను మానసికంగా, ఆర్థికంగా, ఉద్యోగ, ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు పడుతున్నట్లు భవాని తన భర్త చిన్నుకు (వెంకటేశ్వరరావు) వాట్సప్‌లో జూన్ 24న సందేశం పంపింది. రూ.57.35 లక్షల బ్యాంకు అప్పులున్నాయి.. పొలం అమ్మి తీరుద్దామని అందులో పేర్కొంది. ఆ సందేశాలను చిన్ను తొలగించారు. మా విచారణలో అప్పులేమీ లేవని తప్పుడు సమాచారం ఇచ్చారు. కాల్ రికార్డింగ్, వాట్సప్ సందేశాల ద్వారా.. పంచాయతీ సమావేశం ఏర్పాటు విషయంలో ఉన్నతాధికారులు సస్పెండు చేస్తారని భవాని ఆందోళన చెందినట్లు, వైకాపా నాయకులు డబ్బులు డిమాండు చేసినట్లు వెలుగులోకి వచ్చింది’ అని ఎస్పీ వివరించారు.
ఈ కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొన్న ఎంపీపీ భర్త దంగేటి రాంబాబుపై సాక్ష్యాలు రుజువు కాలేదని తెలిపారు. ఆధారాలుంటే తమకు అందజేస్తే, ఎంతటివారిపైనైనా చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
ఇవీ చూడండి: