cotton wicks manufacturing fraud: దూది మాదే.. తయారీ యంత్రం మాదే.. జస్ట్ వత్తులు తయారీ చేసి ఇస్తే.. కిలోకు 600 రూపాయలు. ఇంకేముంది ఇంట్లోనే పని.. చేసుకుంటే సంపాదించుకోవచ్చు అని ఆశపడ్డారు. వాళ్లు అడిగినంత డిపాజిట్లు కట్టారు. రెండు నెలలు సాఫీగానే సాగింది. ఆ తర్వాత ఆ కంపెనీ 600 మందికి కుచ్చుటోపీ పెట్టి.. బోర్డు తిప్పేసింది. ఈ ఘటన తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో వెలుగు చూసింది.
హైదరాబాద్ శివారులోని బోడుప్పల్ కేంద్రంగా.. దూదితో వత్తులు తయారు చేయడం అనే కాన్సెప్ట్ తో జనాల్లోకి వచ్చిందో సంస్థ. దాని పేరు ఏబీజీ సంస్థ. దూదితో వత్తులు తయారు చేసి ఆ కంపెనీకి ఇవ్వాలనేది డ్యూటీ. దీనికోసం దూది తామే ఇస్తామని, వత్తుల తయారీకి అవసరమైన యంత్రాలూ తామే ఇస్తామని చెప్పింది సంస్థ. ఇందుకుగానూ.. కిలో వత్తులకు రూ.600 చొప్పున చెల్లిస్తామని చెప్పింది. తయారు చేసిన వత్తులు తమకే అమ్మాలంటూ జనాలతో ఒప్పందం కూడా కుదుర్చుకుంది.
దీంతో.. జనాలు ఇదేదో బాగానే ఉందని అనుకున్నారు. ఇంటి వద్దనే కూర్చొని చేసే పని కావడంతో.. మహిళలు ముందుకు వచ్చారు. అయితే.. ఓ కండీషన్ బయటకు తీసింది సంస్ష. ఈ పని చేయాలంటే.. ప్రతి ఒక్కరూ లక్ష 70వేల రూపాయలు డిపాజిట్ చేయాలని చెప్పింది. ముందూ వెనకా ఆలోచించకుండా.. ఎంతో మంది ఈ డిపాజిట్ చెల్లించారు. తొలి రెండు నెలలు డబ్బులు బాగానే ఇచ్చింది సంస్థ. దీంతో.. మరికొంత మంది పనిలో చేరారు. ఇలా.. వందల మంది నుంచి డిపాజిట్లు సేకరించారు. ఈ మొత్తం రూ.20 కోట్లకు చేరింది. దీంతో.. మూడో నెలలోనే బిచాణా ఎత్తేశారు నిర్వాహకులు. మోసపోయామని గుర్తించిన బాధితులు.. పోలీసులను ఆశ్రయించారు. ఏబీజీ కంపెనీ యజమాని బాలస్వామి గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇవీ చూడండి :