అనంతపురం జిల్లా కదిరిలో దొంగలు బీభత్సం సృష్టించారు. రెండు ఇళ్లో చోరీకి పాల్పడి ఇద్దరు మహిళల ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం ఓ మహిళను హత్య చేశారు. మరో మహిళపై దాడి చేశారు. మృతురాలు ప్రభుత్వ ఉపాధ్యాయురాలు ఉషారాణి(45)గా గుర్తించారు. ఆమె భర్త శివశంకర్‌రెడ్డి. వీళ్లిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. మంగళవారం ఉదయం శివశంకర్‌రెడ్డి ఉదయపు నడకకు వెళ్లిన సమయంలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు ఉషపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర గాయాలపాలైన ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం ఆమె మెడలోని బంగారం లాక్కెళ్లారు.
అంతకుముందు వారి పక్కింట్లోకి ప్రవేశించిన దుండగులు.. శివమ్మ అనే మహిళపై దాడిచేసి, ఆమె మెడలోని బంగారాన్ని దోచుకున్నారు. తొలుత శివమ్మ కుమారుడు, కోడలిని గదిలో వేసి బంధించారు. ఈ దాడి ఘటనలో శివమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఉదయం ఇంట్లోకి వచ్చిన పనిమనిషి చూసి.. శివమ్మ కుమారుడు, కోడలు ఉన్న గది తలుపులు తెరిచింది.
బయటకు వచ్చిన వారు శివమ్మను బెంగళూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. రెండు ఇళ్లలో ఒకేసారి చోరీ.. ఓ మహిళ హత్య గురించి తెలుసుకున్న స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
ఇదీ చూడండి: student suicide: కళాశాల భవనంపై నుంచి దూకి ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య