తొమ్మిది నెలలు కడుపులో మోసిన కన్నతల్లే తన బిడ్డలను పొట్టనపెట్టుకుంది. పెంచి పోషించాల్సిన ఆ అమ్మే.. ఇద్దరి చిన్నారుల ప్రాణాలు తీసింది. ఊహ తెలియకముందే ప్రపంచానికే దూరం చేసింది. ఇద్దరు పిల్లలను తల్లే అతి గొంతు నులిమి హత్య చేసిన ఘటన సంగారెడ్డిలో జరిగింది.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని శాంతినగర్‌లో నివాసముండే జ్యోత్స్న.. తన ఇద్దరు పిల్లల గొంతునులిమి చంపేసిందని పోలీసులు తెలిపారు. పిల్లలను చంపిన తర్వాత ఆత్మహత్యాయత్నం చేసిందని వెల్లడించారు. చిన్నారుల మృతదేహాలు సంగారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతులు ఆరేళ్ల దేవాన్ష్, నాలుగేళ్ల రుద్రాంష్‌గా గుర్తించారు. పిల్లలకు అనారోగ్యం కారణంగా తల్లి మనస్తాపం చెందిందని పోలీసులు చెబుతున్నారు. చాలా రోజులుగా మానసిక వేదనతో కుంగిపోతోందని.. మధ్యాహ్నం ఇద్దరు పిల్లలకు పారాసిటమాల్ వేసిందన్నారు.
మాత్రలు వేసిన తర్వాత గొంతు నులిమి చంపేసిందని.. ఆ తర్వాత సంగారెడ్డి శివారు మహబూబ్‌సాగర్ చెరువు వద్దకు వెళ్లిన జ్యోత్స్న.. చెరువులో దూకుతున్నట్లు భర్తకు వీడియో పంపింది. స్థానికులు సమాచారం ఇవ్వగా.. చెరువులో దూకిన జ్యోత్స్నను కాపాడామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: Murder: కడప జిల్లాలో ఇద్దరు మహిళల దారుణ హత్య..పాతకక్షలేనా..!