ANANTHA BABU: మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో రిమాండ్‌లో ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు రాజమహేంద్రవరం జైలులో తోటి ఖైదీపై దాడి చేశారని తెలుస్తోంది. ఏదో విషయంపై ఇద్దరికి మాటామాటా పెరగడంతో ఎమ్మెల్సీ కోపంతో అతనిపై చెయ్యి చేసుకున్నారని సమాచారం. నిబంధనల ప్రకారం జైలులో ఉన్న ఖైదీలపై చిన్న గీత పడినా అక్కడి ఆసుపత్రిలో కారణం చెబితే తప్ప చికిత్స చేయరు. అయితే చికిత్స చేయించుకునే స్థాయిలో దెబ్బలు తగల్లేదన్న వాదన కూడా వినిపిస్తోంది.
జైలులో సకల రాచమర్యాదలు..
మరో పక్క ఎమ్మెల్సీ అనంతబాబుకు జైల్లో సకల సౌకర్యాలు అందుతున్నాయని విశ్వసనీయ సమాచారం. రెండు రోజులకే పడుకునేందుకు పరుపు ఏర్పాటు చేశారు. కోరిన ఆహారం బయటి నుంచి అందుతోంది. ఎమ్మెల్సీని జాగ్రత్తగా చూసుకోవాలని అధికారులపై స్థానిక నేతలు పెద్ద స్థాయి నాయకుల నుంచి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారు. నిబంధనల ప్రకారం ఖైదీలు ముగ్గురికి ఒక గది కేటాయిస్తారు. ఎమ్మెల్సీ ఒక్కరినే ఓ గదిలో ఉంచారని సమాచారం.
తరచూ కలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధులు..
నిబంధనల ప్రకారం రిమాండ్ ఖైదీని కుటుంబసభ్యులు మాత్రమే కలవాలి. అది కూడా ఒకసారి ప్రత్యక్షంగా, ఒకసారి నిర్దేశిత సమయంలో సెల్‌ఫోన్‌లో మాట్లాడే అవకాశం ఉంటుంది. ఎమ్మెల్సీ అనంతబాబు విషయంలో మాత్రం ఆయన రిమాండ్‌కు వచ్చిన వెంటనే కొన్ని రోజులకు న్యాయవాదిని అని చెప్పి ఒకరు కలిశారు. అనంతరం రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మి కలిశారు. ఆ తర్వాత కూడా అనధికారికంగా కొందరు ప్రజాప్రతినిధులు తరచూ కలుస్తున్నారు. ఆ విధంగా తనను కలవడానికి వచ్చిన వారి సెల్‌ఫోన్ ద్వారా ఎమ్మెల్సీ తాను మాట్లాడాలని భావించిన వారితో మాట్లాడుతున్నట్లు సమాచారం. ఈ పరిణామాలపై జైలు సూపరింటెండెంట్ రాజారావు వివరణ కోరేందుకు ‘ఈనాడు’ పలుమార్లు ప్రయత్నించినా ఆయన అందుబాటులోకి రాలేదు.
ఇవీ చదవండి: