ROAD ACCIDENT AT ALLURI DISTRICT: కార్తిక మాసంలో తీర్థయాత్ర చేద్దామని ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లా నుంచి కుటుంబ సమేతంగా వచ్చారు. రాముల వారిని దర్శించుకుని.. పర్ణశాలలో దర్శనీయ క్షేత్రాలను చూసి ఆనందంగా ఇంటిముఖం పట్టారు. ఆ ఆనందం అంతలోనే ఆవిరైంది. వారి తిరుగు ప్రయాణంలో 50 కిలోమీటర్ల దూరంలో మృత్యువు మాటేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లాలో విజయవాడ - జగదల్‌పూర్ 30వ నంబరు జాతీయ రహదారిపై చింతూరు మండలం బొడ్డుగూడెం వద్ద ఎదురుగా వస్తున్న లారీని వీరు ప్రయాణిస్తున్న బొలెరో వేగంగా ఢీకొట్టింది. వాహనం అదుపు తప్పిందో.. డ్రైవర్ తప్పిదమో తెలియదు కానీ రెప్పపాటులో మాటలకందని విషాదం చోటుచేసుకుంది. బొలేరో నుజ్జునుజ్జవడంతో అందులో ప్రయాణిస్తున్న ఎనిమిది మంది చెల్లాచెదురుగా రహదారిపై పడిపోయారు. క్షణాల వ్యవధిలో ఆరుగురు అక్కడికక్కడే మృతిచెందారంటే ప్రమాద తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. మరో ఇద్దరిని భద్రాచలం ఏరియా ఆసుపత్రి వరకు తీసుకెళ్లినా.. వైద్యం అందించడం మొదలెట్టిన కొద్దిసేపట్లోనే ప్రాణాలొదిలారు.
ఛత్తీస్‌గఢ్ యాత్రికులు వస్తున్న బొలెరో వాహనం అదుపు తప్పడం కారణంగానే ఈ ప్రమాదం సంభవించిందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఘటనా స్థలానికి వచ్చేసరికి లారీ డ్రైవర్ వాహనాన్ని పూర్తిగా ఎడమ వైపునకు తీసుకు వెళ్లాడు. బొలేరో వాహనం పూర్తిగా కుడి వైపునకు వచ్చేసింది. దీన్ని బట్టి చూస్తే బొలేరో డ్రైవర్ ప్రమాదాన్ని గమనించినా అదుపు చేయలేకపోయి ఉంటాడని భావిస్తున్నారు. బొడ్డుగూడెం వద్ద జరిగిన ప్రమాద విషయాన్ని తెలుసుకున్న చింతూరు ఏఎస్పీ మహేశ్వర్‌రెడ్డి తన సిబ్బందితో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించి సహాయక చర్యలు చేపట్టారు. బొలెరోలో చిక్కుకుపోయిన రెండు మృతదేహాలను అతి కష్టంమీద బయటకు తీశారు. అన్ని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చింతూరు ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
మృత్యుంజయుడు...
బొలెరోలో ప్రయాణిస్తున్న 10 మందిలో ఎనిమిది మంది మృతిచెందగా, ఒకరు అపస్మారక స్థితిలో ఉన్నారు. ఏడేళ్ల బాలుడు దివ్యాన్ష్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు.. ఏం జరిగిందో చెప్పలేక, అయిన వారందరినీ పోగొట్టుకున్నాననే విషయం తెలియక అమాయక చూపులతో కనిపించిన ఆ బాలుడిని చూసి స్థానికులు కంటతడి పెట్టారు. ప్రాణాలతో బయటపడ్డ బాలుడు అందరి గురించి చెప్పలేక పోవడం, మరో వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటంతో వాహనంలో ప్రయాణిస్తున్న వారి పూర్తి వివరాలు మంగళవారం రాత్రి వరకు తెలియలేదు. బంధువులు ఇంకా చింతూరు చేరుకోలేదు. బుధవారం ఉదయానికి వారు వచ్చాకే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.
ఇవీ చదవండి: