Kakinada Sp Office: సీఎం జగన్ క్యాంపు కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ అంశంపై కాకినాడ ఎస్పీ కార్యాలయం వివరణ ఇచ్చింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ఆరుద్ర, భువనేశ్వరరావు దంపతుల కుమార్తె లక్ష్మీ చంద్ర అనారోగ్యంతో బాధపడుతోందని అందులో పేర్కొంది. వైద్యం కోసం అన్నవరంలోని రూ.40 లక్షల విలువ చేసే ఇంటిని పొరుగునే ఉన్న కానిస్టేబుళ్లు కన్నయ్య, శివ.. రూ.10 లక్షలకే అమ్మాలని బెదిరిస్తున్నారని.. దీనిపై స్టేషన్లో ఆరుద్ర గతంలోనే ఫిర్యాదు చేసినట్లు స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో నలుగురిపై కేసు నమోదైనట్లు వివరించింది. ఆరుద్ర పెట్టిన కేసు కొట్టివేయాలంటూ కానిస్టేబుళ్లు హైకోర్టును ఆశ్రయించగా.. 8 వారాలు నిలిపివేస్తూ న్యాయస్థానం ఆదేశించిందని వివరించింది. మంత్రి దాడిశెట్టి రాజా వద్ద గన్ మెన్‌గా పనిచేస్తున్న కానిస్టేబుల్ కన్నయ్య, ఇంటెలిజెన్స్ బాధ్యతలు నిర్వహిస్తున్న శివను వెనక్కి పిలిపించామని స్పష్టం చేసింది. ఈ రెండు కేసులు అన్నవరం పోలీస్టేషన్లో విచారణలో ఉన్నాయని ఎస్పీ కార్యాలయం పేర్కొంది. అటు ఘటనపై స్పందించిన మంత్రి దాడిశెట్టి రాజా.. మహిళకు అన్యాయం జరిగి ఉంటే ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. గన్ మెన్‌ను 3 నెలల క్రితమే అధికారులు తొలగించినట్లు చెప్పారు.