హైదరాబాద్ పంజాగుట్ట పీఎస్ పరిధిలోని నాలుగేళ్లున్న బాలిక అనుమానాస్పదస్థితిలో మృతి చెందిన కేసుపై దర్యాప్తు ఇంకా కొనసాగుతోంది. ఐదు బృందాలుగా ఏర్పడి.. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేపట్టారు. దీపావళి రోజు(గురువారం) ఉదయం జేవీఆర్ పార్కు ఎదుట ద్వారకాపురి కాలనీలోని మూసి ఉన్న దుకాణం ఎదుట బాలిక అచేతనంగా పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసు కంట్రోల్ రూమ్‌కు సమాచారం ఇచ్చారు. పంజాగుట్ట పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు.
బాలిక పడిఉన్నచోట రక్తపు మరకలు లేకపోవడంతో ఘటన ఇక్కడ జరగలేదన్న నిర్ధారణకు వచ్చారు. ఎక్కడో చంపేసి గుట్టుచప్పుడు కాకుండా ఇక్కడ పడేసి ఉంటారనే అనుమానంతో సమీపంలోని దాదాపు వందకుపైగా కెమెరాల పుటేజీ పరిశీలించినా ఎలాంటి పురోగతీ కనిపించలేదు. చిన్నారి మృతదేహంపై పాత గాయాలున్నాయని, అత్యాచారం జరిగిన దాఖలాలు లేవని పశ్చిమ మండలం జాయింట్ కమిషనర్ ఏఆర్ శ్రీనివాస్ శుక్రవారం వెల్లడించారు. ‘రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా మిస్సింగ్ కేసుల వివరాలు పరిశీలిస్తున్నాం. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా బాలిక ఎప్పుడు? ఎలా మరణించింది? శరీరంపై ఇంకా ఏమైనా గాయాలున్నాయా? అనేది తెలుస్తుంది. రెండు రోజుల్లో నిందితులను గుర్తిస్తాం’ అని ఆయన తెలిపారు.
అన్ని ఠాణాల్లోనూ..
రాష్ట్రంలోని అన్ని ఠాణాలతోపాటు.. సామాజిక మాధ్యమాల్లో బాలిక చిత్రాన్ని విడుదల చేసినట్టు చెప్పారు. బాలిక గురించిన సమాచారం తెలిస్తే ఇన్‌స్పెక్టర్ నిరంజన్‌రెడ్డి (94906 16610), డిటెక్టివ్ ఇన్‌స్పెక్టర్ నాగయ్య (94906 16613), ఎస్‌ఐ సతీష్ (94906 16365)లకు తెలియజేయాలని కోరారు. క్షుద్రపూజల కోసం ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
బాలిక ఒంటిపై ఎలాంటి గాయాలు లేకపోవడంతో ఏమి జరిగి ఉంటుందనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. ఎక్కడికైనా వెళ్తూ చిన్నారి ఇక్కడ మృతి చెందిందా.. ? చనిపోయిందని ఇక్కడే పడేశారా అనే కోణంలో వివరాలను తెలుసుకునేందుకు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఇంతవరకు పాప వివరాలు తెలియకపోవడం, ఎలాంటి క్లూ కూడా లభించకపోవడంతో పోలీసులకు ఈ కేసు సవాలుగా మారింది.
ఇదీ చూడండి: