Mahesh Bank Server Hacking Case : హైదరాబాద్‌లోని ఏపీ మహేశ్‌బ్యాంక్‌పై సైబర్‌దాడి కేసులో ప్రధాన నిందితులను పోలీసులు ఇప్పటికీ పట్టుకోలేకపోయారు. ఘటన జరిగి 51రోజులవుతున్నా..రూ.12.90కోట్లు కాజేసిన వారు ఎవరన్నది గుర్తించలేకపోయారు. ఇప్పటి వరకూ 17మంది నిందితులను అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు వారి ద్వారా ప్రధాన నిందితులను పట్టించే ఒక్క ఆధారమూ సేకరించలేకపోయారు. దేశంలోని ప్రధాన నగరాలు, పలు జిల్లాలకూ సైబర్‌క్రైమ్ పోలీసులు వెళ్లారు. అక్కడ నైజీరియన్లకు సహకరించిన వారు మాత్రమే దొరికారు. వీరిద్వారా సేకరించిన సమాచారం మేరకు, ముగ్గురు నైజీరియన్లు వేర్వేరు ప్రాంతాల్లో సమన్వయం చేసుకుని నగదు కొల్లగొట్టారని గుర్తించారు. వీరి నెట్‌వర్క్‌ను ట్రాక్ చేసేందుకు బ్యాంక్‌ఖాతాలు, ఏటీఎం విత్‌డ్రాల వివరాలను సేకరిస్తున్నామని ఒక పోలీస్ అధికారి తెలిపారు.
కమీషన్‌కు ఖాతాలు..
- Mahesh Bank Server Hacking Case Updates : బెంగళూరులో ఓ ప్రేమజంట ఖాతాలో రూ.53లక్షలు నగదు జమ చేయించిన నైజీరియన్‌ను యువతీయువకులు చూశారు. యువతి ఖాతాలో నగదు జమచేసిన నైజీరియన్ ఆమె వద్ద నుంచి రూ.25లక్షల నగదు తీసుకున్నాడు. మరో 15లక్షలు నగదు బదిలీచేసి మిగిలినది కమీషన్‌గా ఉంచుకోవాలని చెప్పాడు. ఈలోపు పోలీసులు అరెస్ట్ చేసి రూ.25లక్షలకుపైగా నగదున్న బ్యాంక్ ఖాతాను స్తంభింపజేశారు.
- Mahesh Bank Cyber Attack Case : ముంబయిలో అర్బాజ్‌ఖాన్‌తో ఓ నైజీరియన్ ఫోన్‌లో మాట్లాడాడు. నగదు బదిలీ చేయాలని ప్రతి ఖాతాకు పదిశాతం కమీషన్ ఇస్తానంటూ చెప్పాడు. అతడు తనకు తెలిసిన వారి బ్యాంక్ ఖాతాల వివరాలు తీసుకుని రూ.1.5కోట్లకుపైగా నగదును వారివారి ఖాతాల్లో జమచేయించి.. కమీషన్ మినహాయించుకుని నైజీరియన్ సూచించిన ఖాతాల్లో మళ్లీ నగదు జమచేశారు.
- ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాపూర్‌లో నివాసముంటున్న విజయ్‌ప్రకాష్ ఉపాధ్యాయ్ అలియాస్ లక్కీతో దిల్లీలో ఉంటున్న మరో నైజీరియన్ మాట్లాడాడు. అతడి సాయంతో రూ.1.90కోట్లు వేర్వేరు ఖాతాల్లో నగదు జమచేయించారు. అనంతరం విజయ్‌ప్రకాష్ నగదు తీసుకుని నైజీరియన్ సూచించిన వ్యక్తులకు దిల్లీ శివారులోని ఓ ప్రాంతంలో అప్పగించి వచ్చాడు.
- యూపీలోని బరేలీలో ఉంటున్న మహ్మద్ అక్తర్, కోల్‌కతాలోని పార్థో హల్దార్‌తో దిల్లీలో ఉంటున్న ఒక నైజీరియన్ నాలుగు నెలల క్రితం ఫోన్‌లో మాట్లాడాడు. తాను రూ.2 కోట్లకుపైగా నగదు జమచేస్తానని, ఖాతాలు సమకూర్చితే 20శాతం కమీషన్ ఇస్తానంటూ ప్రలోభపెట్టగా.. వారు సరేనని కమీషన్ తీసుకుని ఖాతాలను సమకూర్చారు.
- నైజీరియన్ సూచనతో బషీర్‌బాగ్‌లోని మహేశ్‌బ్యాంక్ శాఖలో ఖాతాను ప్రారంభించిన హైదరాబాద్ యువతి షానాజ్ ఆచూకీని పోలీసులు ఇప్పటికీ గుర్తించలేకపోయారు. ఆమె ఫోన్‌కాల్స్ డేటా ఆధారంగా ముంబయిలో నైజీరియన్‌కు సహకరించిన అర్బాజ్‌ఖాన్‌ను కలిసిందని అనుమానిస్తున్నారు. మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
- ఇదీ చదవండి :
మహేశ్ బ్యాంక్ సర్వర్ హ్యాకింగ్ కేసులో మరింత పురోగతి... నలుగురు అరెస్ట్