Husband Killed Wife: ‘తాతా.. మరేమో.. నాన్నేమో.. అమ్మ గొంతును ఇదిగో ఇలా.. రెండు చేతులతో పట్టుకుని.. గట్టిగా నొక్కిండు. అమ్మేమో కాళ్లూ చేతులూ కొట్టేసుకుంది. కాసేపయ్యాక అస్సలు కదలకుండా అలాగే పడుకుంది..’ అని కొన్ని వచ్చీరాని మాటలు.. మరికొన్ని సైగలతో గొంతుపై చేతులు వేసుకుని మనవరాలు చూపిస్తుంటే.. ఆ పెద్దాయనకు గుండె ఆగినంత పనైంది. అప్పటి దాకా తన కుమార్తె మూర్ఛ వచ్చి చనిపోయిందని అనుకున్నారాయన. తన కుమార్తెను అల్లుడే హతమార్చాడని మనవరాలి మాటల ద్వారా అర్థమైంది. చిన్నారిని తీసుకుని పోలీసుస్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారాయన. పుట్టిన బిడ్డ నల్లగా ఉందని అనుమానం పెంచుకున్న భర్త.. భార్యను చంపేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాలోని ఉమ్మర్‌కోట్ సమితి సిలాటిగావ్ గ్రామానికి చెందిన మాణిక్ ఘోష్‌కు కారాగావ్ గ్రామానికి చెందిన లిపికా మండల్(22)తో ఏడేళ్ల క్రితం వివాహమైంది. పెళ్లయ్యాక వారిద్దరూ ఉపాధి కోసం ఏపీలోని కాకినాడకు వలస వెళ్లారు. రెండున్నరేళ్ల కిందట వారికి మహి జన్మించింది. ఆ చిన్నారి నల్లగా ఉందని లిపికాపై మాణిక్ అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయమై వారిద్దరి మధ్య పలుమార్లు గొడవలయ్యాయి. ఈ ఏడాది మొదట్లో మరోసారి గొడవ జరగడంతో లిపికా పుట్టింటికి వచ్చేశారు. జూన్‌లో అత్తింటివారు కారాగావ్ వెళ్లి లిపికాకు సర్దిచెప్పి కాకినాడ పంపారు. ఈ నెల 18న రాత్రి లిపికాకు మూర్ఛ రాగా, మాణిక్ స్నేహితుల సహకారంతో అంబులెన్సులో ఆసుపత్రికి తరలించాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మెడపై కమిలినట్లు గుర్తులు కనిపించడంతో ఆసుపత్రి సిబ్బంది కాకినాడ పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో వారు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పోస్టుమార్టం నిర్వహించి, దహన సంస్కారాలు పూర్తిచేశారు. లిపికా తల్లిదండ్రులు మంగళవారం కాకినాడ వెళ్లి, చిన్నారిని తమతో కారాగావ్ తీసుకొచ్చారు. తల్లి ఎలా చనిపోయిందో, తండ్రి ఏం చేశాడో ఆ చిన్నారి.. తాత తపన్ మండల్‌కు వివరించింది. ఆయన శనివారం చిన్నారితో కలిసి ఉమ్మర్‌కోట్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ బాలిక జరిగిన విషయాన్ని పోలీసులకూ తెలిపింది. ఈ మేరకు వారు కాకినాడ పోలీసులకు సమాచారం అందించగా నిందితుడిని అరెస్టు చేశారు.
ఇవీ చదవండి: