Firing in Jewellery Shop : కాసేపైతే దుకాణాన్ని మూసివేస్తారనగా..తెలంగాణలోని నాగోల్ స్నేహపురి కాలనీలోని మహదేవ్ జ్యువెల్లరీ షాపులోకి ఇద్దరు వ్యక్తులు హడావుడిగా వచ్చారు. వచ్చిరాగానే షట్టర్ మూసివేశారు. లోపల ఉన్న షాపు యజమాని కల్యాణ్‌తో పాటు, అక్కడే ఉన్న సుఖ్‌దేవ్ అనే వ్యక్తిపై కాల్పులకు తెగబడ్డారు. కల్యాణ్‌కు దవడల్లోంచి బుల్లెట్ దూసుకుపోయింది. సుఖ్‌దేవ్‌కు చెవి, వీపు మీదుగా.. తొడమీదుగా బుల్లెట్లు దూసుకుపోయాయి. కాల్పులు జరిపిన కొద్ది క్షణాల్లోనే దుండగులు బంగారంతో ఉన్న బ్యాగ్‌ను అక్కడ నుంచి తీసుకుని వేగంగా ద్విచక్రవాహనంపై వెళ్లిపోయారు.
స్థానికులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ప్రతిఘటించి పారిపోయారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీంతో ఆధారాలు సేకరించారు. సికింద్రాబాద్‌లో ఉన్న హోల్‌సేల్ బంగారు షాపుల నుంచి రిటేల్ వర్తకులు వారికి కావాల్సిన ఆర్డర్‌లను తెప్పించుకుంటారు. అలా ఒకేసారి కొన్ని షాపులకు కలిపి బంగారు నగలను తీసుకొస్తుంటారు. ఆ విధంగా సుఖ్‌దేవ్ రాత్రి తొమ్మిదిన్నర గంటల సమయంలో అలా ఒక్కో షాప్‌నకు నగలను అందజేస్తూ వస్తున్నాడు. అతడిని చాలాసేపటి నుంచి దుండగులు అనుసరిస్తున్నారని సుఖ్‌దేవ్ గమనించలేదు.
సమయం చూసి అతడిపై దాడి చేసి బంగారం ఎత్తుకెళ్లాలనేది దుండగుల ఆలోచన. కానీ మహదేవ్ జ్యువెల్లరీ దగ్గరికి వచ్చేసరికి.. దుండగులకు అవకాశం లభించలేదు. సుఖ్‌దేవ్ జ్యువెల్లరీ షాప్‌లోకి వెళ్లి బంగారం అందజేసే క్రమంలోనే ఇద్దరు దుండగులు లోపలికి చొరబడి కాల్పులకు తెగబడి.. పారిపోయారని పోలీసులు తెలిపారు. కాల్పుల్లో గాయపడ్డ యజమాని కల్యాణ్, సుఖ్‌దేవ్‌లకు చికిత్స కొనసాగుతుందన్నారు. ఆరోగ్యం నిలకడగానే ఉందని వెల్లడించారు.
దుకాణంలోకి ఒక్కసారిగా వచ్చి.. షట్టర్ మూసేసి కాల్పులకు తెగబడ్డారని బాధితులు తెలిపారు. ప్రస్తుతం ఇద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని.. సుఖ్‌దేవ్‌కు వీపులో ఉన్న తూటాను తొలిగించేందుకు శస్త్ర చికిత్స చేస్తామని వెైద్యులు తెలిపారు. నిందితులు పారిపోయిన మార్గాల్లోని అన్ని సీసీ కెమెరాలను పోలీసులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు. మొత్తం 15 బృందాలను రంగంలోకి దించారు. ఘటనకు పాల్పడింది బయట రాష్ట్రాల వాళ్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు.
ఇవీ చదవండి: