Farmer Suicide: పుడమి తల్లిని నమ్ముకొని రెక్కలు ముక్కలు చేసి బతుకులీడుస్తున్న రైతులకు అప్పులు తీవ్ర మనోవేదనను మిగులుస్తున్నాయి. పంట చేతికి రాక.. వచ్చినా గిట్టుబాటు ధర లేక ఎందరో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. తాజాగా ఓ రైతు సైతం అప్పులు తీర్చే మార్గం లేక తన పొలంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కనేకల్ మండలం సొల్లాపురం గ్రామంలో చోటుచేసుకుంది.
పన్నూరుస్వామి (36) అనే యువ రైతుకి దాదాపు రూ.20 లక్షల మేర అప్పు ఉన్నట్లు బంధువులు తెలిపారు. బ్యాంకులు, రుణదాతల ఒత్తిడి వల్ల ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పారు. గత పదేళ్లుగా పంటలు పండక అప్పుల పాలయ్యాడని.. అసలు, వడ్డీలకు ఉన్న సొమ్ములు, ట్రాక్టరు, బంగారు నగలు పోగొట్టుకున్నాడని బంధువులు తెలిపారు. అప్పుల బాధ భరించలేకే ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడినట్లు గ్రామంలోని ప్రజలు వెల్లడించారు. బాధిత రైతు కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాల ఆదుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: "మీరేం చేసినా.. రాహుల్ గాంధీ వచ్చి తీరుతారు"