Today Crime News: విజయవాడలో తనిఖీలు నిర్వహించిన విద్యుత్ విజిలెన్స్ అధికారులు... రూ.6.92 లక్షలు జరిమానా విధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో నగల దుకాణంలో చోరీ జరిగింది.
మహిళను హత్యచేసి...అనంతరం ఆత్మహత్య: కర్నూలు జిల్లా ఆస్పరి మండలం ముత్తుకూరు గ్రామంలో మహిళ దారుణ హత్యకు గురైంది. లింగమ్మ (52) అనే మహిళను ఆమె బావ హనుమంతు బుధవారం అర్ధరాత్రి రాళ్లతో కొట్టి దారుణంగా హత్య చేశాడు. అనంతరం అతడు సైతం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. హనుమంతును ఆదోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇద్దరి మధ్య వివాహేత సంబంధం ఉందని లింగమ్మ భర్త కొన్నేళ్ల క్రితం చనిపోయాడని... డబ్బుల కోసం తల్లిని కూడా వేధించేవాడని హనుమంతు కుమారుడు మధు తెలిపాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆస్పరి పోలీసులు చెప్పారు.
కారు-ట్రాక్టర్ ఢీ... ఒకరు మృతి: తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగ వద్ద కారు-ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురికి గాయాలయ్యాయి.
తెదేపా-వైకాపా వర్గీయుల ఘర్షణ... 22 మందికి గాయాలు: పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామంలో తెదేపా, వైకాపా వర్గీయుల మధ్య ఘర్షణ జరిగింది. అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో నిద్రిస్తున్న తెదేపా వర్గం వారిపై... వైకాపాకు చెందిన వ్యక్తులు.... రాళ్లు, కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి పాల్పడినట్లు బాధితులు చెబుతున్నారు. ఈ ఘటనలో మొత్తం 22 మంది గాయపడగా... ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. దాడిలో 13 మంది తెదేపా, 8మంది వైకాపాకు చెందిన వారికి గాయాలయ్యాయి. గాయపడిన వారంతా వినుకొండ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. గోవర్థన్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు గ్రామంలో 144సెక్షన్ విధించినట్లు తెలిపారు. వైకాపా వర్గం వారు పక్కా ప్రణాళికతో దాడికి పాల్పడ్డారని... తెదేపాకు చెందిన బాధితులు ఆరోపిస్తున్నారు.
176 కేసులు...రూ.6.92 లక్షలు జరిమానా: కృష్ణా జిల్లాలో విజయవాడ భవానీపురం సెక్షన్ పరిధిలో విద్యుత్ విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. 47 బృందాలుగా ఏర్పడి తనిఖీలు నిర్వహించిన అధికారులు... 176 కేసులు నమోదు చేసి రూ.6.92 లక్షలు జరిమానా విధించారు.
నగల దుకాణంలో చోరీ: పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలోని నగల దుకాణంలో అర్ధరాత్రి చోరీ జరిగింది. భారీగా వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులకు యజమాని ఫిర్యాదు చేశారు.
నీటి గుంటలో పడి బాలుడు మృతి: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విషాదం చోటు చేసుకుంది. మారంపల్లి కాలనీలోని ఓ ఇంట్లో నీటి గుంటలో పడి 9 ఏళ్ల బాలుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరుగా విలపించారు.
వైకాపా నేత పార్థసారథి ఆత్మహత్య: చిత్తూరు జిల్లా కుప్పంలో వైకాపా నేత పార్థసారథి.. రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పార్థసారథి ప్రసన్న తిరుపతి గంగమాంబ ఆలయ పాలకవర్గ మాజీ ఛైర్మన్ గా ఉన్నారు. ఇటీవల ఆలయ నూతన పాలకవర్గాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేయగా.. కొత్త ఛైర్మన్‌ను ఎన్నుకుంది. తనను పదవి నుంచి తొలగించడాన్ని జీర్ణించుకోలేకే.. ఆత్మహత్య చేసుకున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మదనపల్లెలో క్షుద్రపూజల కలకలం: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో క్షుద్రపూజలు కలకలం సృష్టించాయి. గుర్తుతెలియని వ్యక్తులు... ఓ ఇంటి ముందు గుడ్లు, మేకులు గుచ్చిన నిమ్మకాయలు ఉంచడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పోలీసులకు ఇంటి యజమాని ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేపట్టారు.
చేబ్రోలులో గంజాయి సీజ్: గుంటూరు జిల్లా చేబ్రోలు మండలంలో పోలీసుల తనిఖీలు నిర్వహించారు. చేబ్రోలు మూడో సచివాలయం సమీపంలో నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
కర్ణాటక మద్యం సీజ్... పలువురు అరెస్టు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలంలో ఎస్‌ఈబీ అధికారుల తనిఖీలు చేపట్టారు. బట్టేపాడు వద్ద ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన కర్ణాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. పలువురిని అరెస్టు చేశారు. ఆత్మకూరు, అనంతసాగరంలో అక్రమ మద్యం నిల్వల ఉన్నట్లు సమాచారంతో సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
వ్యక్తి హల్‌చల్... కుక్కను కత్తితో నరికి: ఏలూరు జిల్లా ముసునూరు మండలం మం. చింతలవల్లిలో వ్యక్తి హల్‌చల్ చేశాడు. ఓ ఇంట్లోకి వెళ్లి కుక్కను కత్తితో విచక్షణారహితంగా నరికి చంపాడు. పోలీసులకు కుక్క యజమాని, గ్రామస్థుల ఫిర్యాదు చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని శిక్షించాలని స్టేషన్ వద్ద ఎస్‌ఐతో గ్రామస్థుల వాగ్వాదానికి దిగారు. పోలీసుస్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు.
వేర్వేరు కేసుల్లో ముగ్గురు అరెస్ట్: కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్ పోలీసులు వేరు వేరు కేసుల్లో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరి నుంచి రూ.26.50 లక్షల విలువైన 530 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో రూ.5.72 లక్షల విలువైన ఆభరణాలు, నగదు సీజ్ చేశారు. చెడు వ్యసనాలకు అలవాటుపడి చోరీలకు పాల్పడుతున్నట్లు దర్యాప్తులో తేలిందని డీఎస్పీ వివరించారు.
యువకుడిని హత్య చేసి... నిప్పంటించారు: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో గుర్తు తెలియని వ్యక్తులు ఓ యువకుడిని హత్య చేసి నిప్పంటించారు.దేశాయిపేటకు చెందిన సిద్ధినేని నవీన్ ప్రశాంత్ (21) అనే యువకుడిని దుండగులు హత్య చేసి అనంతపరం పంట పొలాల్లో మృతదేహానికి నిప్పంటించి పరారయ్యారు. మృతదేహాన్ని గుర్తించిన పశువుల కాపర్లు పోలీసులకు సమాచారమివ్వడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు. తమ కుటుంబ సభ్యుల మధ్య నెలకొన్న పొలం వివాదాల కారణంగానే తన కుమారుడిని హత్య చేశారని మృతుడి తల్లి ఆరోపించింది.
కుళ్లిన స్థితిలో మృతదేహం: అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మొండికోటలో కుళ్లిన స్థితిలో మృతదేహం లభించింది. కొండకు పుల్లల కోసం వెళ్తున్న కొందరికి దుర్గంధం రావడంతో అస్తిపంజరంలా మారిన మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనాస్థలాన్ని పరిశీలించారు. గత నవంబరులో హుకుంపేట మండలం ఉప్ప గ్రామానికి చెందిన ఉబ్బెటి సింహాచలం(55) అనే మతిస్థిమితం లేకుండా వెళ్లిపోయాడని ఫిర్యాదు అందిందని మృతదేహం అతడిదేనని కుటుంబసభ్యులు గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.
మినీ లారీని ఢీకొట్టిన మరో లారీ: గుంటూరు జిల్లా దాచేపల్లి వద్ద బుధవారం రాత్రి మిని లారీని మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్కెస్ట్రా బృందంలోని 20 మందికి గాయాలయ్యాయి. నరసరావుపేటకు చెందిన ఆర్కెస్ట్రా బృందానికి చెందిన మినీ లారీ గురజాల వెళ్తుడగా దాచేపల్లి నుంచి తంగెడ వెళ్తున్న మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. గాయపడినవారిని నారాయణపురంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరిలించారు.
ఇదీ చదవండి: Remand report: సులభంగా డబ్బు సంపాదించాలనే...మాదక ద్రవ్యాలు సరఫరా