AP Crime News: క్వారీ గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన.. చిత్తూరు జిల్లా తొట్టంబేడులో జరిగింది. పోలీసుల సమాచారం మేరకు చంద్రబాబు నాయుడు కాలనీకి చెందిన వెంకటయ్య(45) ముగ్గురు మిత్రులతో కలిసి సరదాగా క్వారీ వద్దకు వెళ్లారు. ప్రమాదవశాత్తు క్వారీ నీటి గుంతలో దూకడంతో.. వెంకటయ్య నీట మునిగి మృతి చెందినట్లు ఎస్సై రాఘవేంద్ర తెలిపారు.
పేకాట స్థావరాలపై దాడులు
అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం దురదకుంట - వెంకటంపల్లి గ్రామల మధ్యలో పేకాట స్థావరంపై ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఇందులో భాగంగా.. 20 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.1,95,610 నగదు, 23 ద్విచక్రవాహనాలు, 27 చరవాణీలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు వారిపై కేసు నమోదు చేసుకుని రిమాండ్‌కు తరలించారు.
రౌడీషీటర్ హత్యకేసులో నిందితుల అరెస్టు
అనంతపురం జిల్లా ధర్మవరంలోని ఇందిరమ్మ కాలనీ వద్ద.. ఈ నెల 21న జరిగిన రౌడీ షీటర్ హరి ప్రసాద్ హత్య కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ హత్య కేసులో నిందితుడిగా ఉన్న హరి ప్రసాద్‌కు.. షేక్షావలి అనే యువకుడితో పాత గొడవలు ఉన్నాయి. వీరిద్దరి మధ్య గొడవ జరగడంతో ప్రసాద్ పై షేక్షావలి అతని స్నేహితులు మస్తాన్, మల్లేష్.. బండరాయితో మోది చంపారు. పరారీలో ఉన్న వారిని అరెస్ట్ చేసిన పోలీసులు.. ధర్మవరం కోర్టులో హాజరుపరిచగా కోర్టు వారికి రిమాండ్ విధించినట్లు సీఐ కరుణాకర్ తెలిపారు.
మహిళను హత్య చేసిన నిందితుడి అరెస్టు
వివాహేతర సంబంధం వద్దని చెప్పిన మహిళను హత్య చేసిన నిందితుడిని.. కడప జిల్లా చెన్నూరు పోలీసులు అరెస్టు చేశారు. అతని నుంచి కొంత బంగారం, నగదు స్వాధీనం చేసుకున్నారు.
చెన్నూరు మండలం కొండ పేటకు చెందిన జ్యోతి, రంగనాయకులకు కొంతకాలం కిందట వివాహమైంది. వీరు గతంలో అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం మండలంలో నివసించేవారు. మూడు నెలల కిందట జ్యోతి, రంగనాయకులు కొండపేట వచ్చి స్థిరపడ్డారు. బుక్కరాయసముద్రంలో ఉన్నప్పుడు జ్యోతి నాగరాజు అనే వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అయితే వీరు కొండపేట వచ్చినప్పటికి నాగరాజు ఆమెను వదలటం లేదు. ఈనెల 17న నాగరాజు కొండపేటకు వచ్చి జ్యోతి వద్దకు వెళ్లగా.. అతడిని మందలించింది. ఆగ్రహానికి గురైన నాగరాజు.. అక్రమ సంబంధం కొనసాగించాలని ఆమెతో గొడవ పడ్డాడు. జ్యోతి ఒప్పుకోకపోవడంతో కోపోద్రిక్తుడైన నాగరాజు.. ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. ఆమె వదనున్న బంగారం, నగదును అపహరించాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించగా.. తానే నేరం చేశానని నాగరాజు ఒప్పుకున్నట్లు.. కడప డీఎస్పీ వెంకటశివారెడ్డి తెలిపారు.
ఇదీ చదవండి:
Rowdy Sheeter Murder: విజయవాడ శివారులో రౌడీషీటర్ అనుమానస్పద మృతి.. బ్లేడ్ బ్యాచ్ పనేనా..!