Car Accident at Kadapa: బోసి నవ్వులతో మురిపించే మనవరాలితో ఆడుకుంటూ సంతోషంగా గడుపుతున్న జీవితాలు. ఇటీవల స్వదేశానికి వచ్చిన అల్లుడు, కుమార్తె, మనవరాలిని చూసుకుంటూ మురిసిపోతున్న ఆనందం. ఈ సమయంలో ప్రమాద రూపంలో వచ్చిన మృత్యువు మనవరాలితో సహా అవ్వతాతలను కబలించింది. ఎంతో అభిమానంతో చూసుకునే అత్తమామలను... అల్లుడు కోల్పోయారు. ఈ విషాద ఘటన ఆదివారం రాత్రి రైల్వేకోడూరు మండలం కొత్తపల్లి వద్ద జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. రామాపురం ఒడ్డుపల్లెకు చెందిన రాజేష్... ఉద్యోగరీత్యా కువైట్‌లో స్థిరపడ్డారు. రెండు వారాల కింద స్వస్థలానికి కుటుంబ సమేతంగా వచ్చారు. కుటుంబ సభ్యులకు ఆరోగ్య పరీక్షలు చేయించాలని... తిరుపతి ఆస్పత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తున్నారు. వస్తూ... వస్తూ అత్తమామలపై మమకారంతో ఓబులవారిపల్లెకు వెళ్లి అక్కడ సిద్ధమ్మ, గురువయ్యలను తీసుకుని రామాపురం ఒడ్డుపల్లెకు బయలుదేరారు. రాజేష్ నడుపుతున్న కారు అదుపుతప్ఫి.. కొత్తపల్లి రహదారి పక్కనున్న చెట్టును వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న... రాజేష్ మామ గురవయ్య (45) భార్య తండ్రి, మరో మామ రామచంద్రయ్య (50), ఆరు నెలల కుమార్తె (ఇంకా పేరు పెట్టలేదు) అక్కడికక్కడే మరణించారు. వాహనంలో ఉన్న రాజేష్, భార్య అంజలి, అత్త సిద్ధమ్మ, బాబాయ్ సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడ్డారు. వీరిని తిరుపతి రుయాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ సిద్ధమ్మ (40) మరణించారు. కువైట్‌కు వెళ్లడానికి గురవయ్యకు అన్ని రకాల అనుమతులు లభించాయి. త్వరలో వెళ్లాల్సి ఉంది. వాహనంలో చికిత్స పొందినట్లు రశీదులు, మందులు పడిఉండటాన్ని బట్టి ఆస్పత్రి కోసం తిరుపతి వెళ్లినట్లుందని పోలీసులు తెలిపారు. గాయపడినవారు స్పృహలో లేనందున ప్రమాదానికి ముందు... ఘటన పూర్తి వివరాలు తెలియరాలేదన్నారు.ది.
ఇదీ చదవండి: Car Accident at Karimnagar: గుడిసెల్లోకి దూసుకెళ్లిన కారు..నిద్రిస్తున్న నలుగురు దుర్మరణం