సంచలనం సృష్టించిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు (tollywood drugs case)లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) విచారణ కొనసాగుతోంది. దర్యాప్తులో భాగంగా ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్ ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరైన దర్శకుడు పూరీ జగన్నాథ్ (puri jagannath)ను దాదాపు 8 గంటలుగా ఈడీ అధికారులు విచారిస్తున్నారు. డ్రగ్స్ కేసులో ఆర్థిక లావాదేవీలపైనే ప్రధానంగా దృష్టి పెట్టిన ఈడీ అధికారులు.. ఈ మేరకు పూరీ జగన్నాథ్ నుంచి వివరాలు సేకరిస్తున్నారు.
పూరీ జగన్నాథ్ బ్యాంకు లావాదేవీలకు సంబంధించి అధికారులు ఆయనను పలు ప్రశ్నలు వేశారు. పూరీ జగన్నాథ్ చార్టెడ్ అకౌంట్ శ్రీధర్ కూడా ఈడీ అధికారుల ఎదుట హాజరై ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సమర్పించారు.
ఈడీ కార్యాలయానికి బండ్ల గణేశ్..
ఈ క్రమంలోనే పూరీ జగన్నాథ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈడీ (ED) అధికారులు నటుడు, నిర్మాత బండ్ల గణేశ్‌ను కార్యాలయానికి పిలిచించారు. ఈడీ పిలుపు మేరకు కార్యాలయానికి వచ్చిన బండ్ల గణేశ్.. ఈ కేసులో ఇప్పటి వరకు తనకు ఎలాంటి నోటీసులు రాలేదని పేర్కొన్నారు. వక్కపొడి కూడా తినే అలవాటు లేని తనకు నోటీసులు ఎందుకు ఇస్తారని ప్రశ్నించారు. పూరీ జగన్నాథ్‌ను కలిసేందుకే కార్యాలయానికి వచ్చినట్లు ఆయన స్పష్టం చేశారు. ఈడీ కార్యాలయంలోనే పూరీ కుమారుడు ఆకాశ్ పూరీ, సోదరుడు సాయిరాం శంకర్, ఆడిటర్ సతీశ్ ఉన్నారు.
ఈ కేసులో సెప్టెంబర్ 2న చార్మి, 6న రకుల్ ప్రీత్ సింగ్, 8న రానా దగ్గుబాటి, 9న రవితేజ, శ్రీనివాస్, 13న నవదీప్‌తో పాటు ఎఫ్ క్లబ్ మేనేజర్, 15న ముమైత్ ఖాన్, 17న తనీశ్, 20న నందు, 22న తరుణ్ ఈడీ అధికారుల ఎదుట హాజరు కావాల్సి ఉంది.
ఇదీ జరిగింది..
నాలుగేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఎక్సైజ్ అధికారులకు చిక్కిన కొందరు డ్రగ్స్ విక్రేతల విచారణలో పలువురు సినీ ప్రముఖుల పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. సినీ ప్రముఖులను ఎక్సైజ్ అధికారులు సుదీర్ఘంగా విచారణ జరిపారు. రక్తం, గోళ్లు, వెంట్రుకల శాంపిల్స్ సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే, సినీ ప్రముఖులకు క్లీన్‌చీట్ ఇచ్చిన ఎక్సైజ్ అధికారులు.. పలువురు డ్రగ్స్ విక్రేతలపై 12 ఛార్జిషీట్లు దాఖలు చేశారు. డ్రగ్స్ సరఫరాదారులకు.. సినీ సెలబ్రిటీలకు మధ్య నగదు లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు ఇప్పటికే ప్రాథమిక ఆధారాలు సేకరించారు.
సంబంధిత కథనాలు..
DRUGS CASE : డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం.. విచారణకు హాజరైన పూరి