తెలుగు సినీ పరిశ్రమలో సంచలనంగా మారిన మాదకద్రవ్యాల(Tollywood Drugs Case) కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణ ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి ఛార్మిలను సుదీర్ఘంగా విచారించిన ఈడీ(ED) అధికారులు శుక్రవారం ఉదయం ప్రముఖ నటి రకుల్‌ప్రీత్ సింగ్(Rakul preet singh)ను ప్రశ్నిస్తున్నారు. విచారణ నిమిత్తం రకుల్ ఇప్పటికే ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్ కోణంలో ఆమె బ్యాంక్ ఖాతాలను అధికారులు పరిశీలించనున్నారు. ఆమె వ్యక్తిగత లావాదేవీలపై ఈడీ అధికారులు ఆరా తీయనున్నట్లు సమాచారం.
డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రకుల్‌ప్రీత్ సింగ్ ఆరో తేదీన ఈడీ ఎదుట హాజరు కావాల్సి ఉంది. అయితే, షూటింగ్స్ ఉండటంచేత తాను హాజరు కాలేకపోతున్నానని.. కాస్త గడువు ఇవ్వాలని ఈడీ అధికారులను రకుల్ కోరారు. అందుకు అంగీకరించని అధికారులు.. మూడు రోజుల ముందుగానే విచారణ చేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆమె ముందుగానే ఈడీ ఎదుట హాజరయ్యారు. మరోవైపు 8న రానా ఈడీ విచారణకి రానున్నారు.