BOY BEATEN TO DEATH BY AUNT : మేనత్త అంటే తల్లి తర్వాత తల్లి అంటారు. అలాంటిది అభం శుభం ఎరుగని పదేళ్ల మేనల్లుడిని చిత్రహింసలు పెట్టి ఒంటిపై కాల్చి చివరకు చంపేసింది. ఆమెకు భర్త తోడయ్యాడు. చిన్నపిల్లాడని చూడకుండా.. అల్లరి చేస్తున్నాడన్న నెపంతో 10 రోజులుగా ఇష్టమొచ్చినట్లు కొట్టి.. వారిద్దరూ బాలుడి మృతికి కారణమయ్యారు. ఈ దారుణ ఘటన వైయస్‌ఆర్ జిల్లా కేంద్రం కడపలో ఆదివారం చోటుచేసుకుంది.
కడప చిన్నచౌకు సీఐ అశోక్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. అన్నమయ్య జిల్లా నందలూరు మండలం కోనంపేటకు చెందిన శివ, భాగ్యమ్మకు ఇద్దరు పిల్లలు. అయాన్ (10) పెద్ద కుమారుడు. శివ సోదరి ఇంద్రజ.. అంజన్ కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లాడింది. వీరు కడపలో ఉంటున్నారు. ప్రేమ వివాహం చేసుకోవడంతో కొద్ది రోజులు శివ తన సోదరితో మాట్లాడటం మానేశారు. ఇంద్రజకు కుమార్తె పుట్టాక అందరూ కలిసిపోయారు. అంజన్ కుమార్ కడపలో ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. శివ, భాగ్యమ్మ ఇద్దరూ మూడేళ్ల క్రితం జీవనోపాధి కోసం గల్ఫ్‌కు వెళ్లారు.
పిల్లలను వాళ్ల నాన్నమ్మ ఇందిరమ్మవద్ద వదిలిపెట్టారు. 10 రోజుల క్రితం బంధువుల ఇంట్లో పుట్టిన రోజు వేడుకలకు ఇంద్రజ, అంజన్ కుమార్ కోనంపేటకు వెళ్లారు. అయాన్‌ను కడపకు తీసుకెళ్లి చదివిస్తామని చెప్పడంతో నాన్నమ్మ అంగీకరించింది. అయాన్‌ను తన సోదరి ఇంటికి పంపడం శివకు ఇష్టం లేదు. అయినా ఇంద్రజ, అంజన్ కుమార్ బాలుడిని కడపకు తీసుకొచ్చారు. అప్పటి నుంచి చిత్రహింసలు మొదలుపెట్టారు. శివపై ఉన్న ద్వేషంతో అయాన్‌ను అంజన్ కుమార్ తరచూ కొట్టేవాడు. బాలుడి శరీరం మొత్తం గాయాలున్నాయి. తొడపై కాల్చిన గాయముంది.
శనివారం రాత్రి అయాన్ చలనం లేకుండా పడిపోవడంతో వెంటనే ఇంద్రజ, అంజన్‌కుమార్ ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి.. అప్పటికే మృతి చెందాడని చెప్పడంతో వారిద్దరూ అయాన్‌ను అక్కడే వదిలేసి పరారయ్యారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నాన్నమ్మ ఇందిరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇంద్రజ, అంజన్ కుమార్‌పై హత్య కేసు నమోదు చేస్తామని సీఐ పేర్కొన్నారు. గల్ఫ్‌లో ఉన్న అయాన్ తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో తల్లి భాగ్యమ్మ బయలుదేరి వస్తోందని సీఐ చెప్పారు.
ఇవీ చదవండి: