Hotel Moghuls Paradise Incident: మద్యం మత్తులో ఓ వ్యక్తిని దొంగగా భావించి చితకబాదటంతో అతను మృతి చెందిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీలో చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన రాజేశ్ మాదాపూర్‌లో కుటుంబంతో సహా నివసిస్తూ, భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేస్తున్నాడు.
బుధవారం ప్రగతినగర్‌లో పని ముగించుకొని అర్థరాత్రి బిర్యానీ కోసమని, కూకట్పల్లి జాతీయ రహదారిపై ఉన్న మొఘల్స్ ప్యారడైజ్ రెస్టారెంట్ సెల్లార్ దగ్గరకు వెళ్లాడు. అదే సమయంలో అక్కడ జన్మదిన వేడుకలు చేసుకుంటున్న హోటల్ సిబ్బంది, రాజేశ్‌ని దొంగగా భావించారు. అప్పటికే తాగి ఉన్న వారు విచక్షణరహితంగా అతనిపై దాడి చేసి.. అక్కడే వదిలేసి వెళ్లారు. గురువారం ఉదయం 7 గంటల సమయంలో రెస్టారెంటు వద్దకు వచ్చిన సిబ్బంది, అపస్మారక స్థితిలో పడి ఉన్న రాజేశ్‌ను చూశారు. అతని జేబులోని చీటీలో గల ఫోన్ నంబర్ ఆధారంగా అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్న రాజేశ్ భార్య, అతడిని ఇంటికి తీసుకొని వెళ్లింది.
ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బుల్లేక..
తన దగ్గర ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో.. అతనిని ఇంటి దగ్గరే ఉంచింది. ఉదయం 11.30 గంటల సమయంలో రాజేశ్ మృతి చెందాడు. మృతుని భార్య మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. తమ పరిధి కాదంటూ కేపీహెచ్‌బీ ఠాణాకు వెళ్లాలని సూచించారు. రాజేశ్ భార్య ఫిర్యాదుతో కేపీహెచ్‌బీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నలుగురు రెస్టారెంట్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: Movie Style Theft: స్పెషల్ చబ్బీస్ సినిమా స్ఫూర్తితో దోపిడీ... కట్ చేస్తే!