- ఈనెల 1న గంజాయితో తయారుచేసిన నూనెతో పాటు పొడి విక్తయిస్తుండగా.. ఐడీఏ నాచారంలో ముగ్గురిని అబ్కారీ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
- రాజీవ్ రహదారిపై అక్రమంగా తరలిస్తున్న 24 కిలోల గంజాయిని శామీర్‌పేట పోలీసులు స్వాధీనం చేసుకుని.. ముగ్గురిని రిమాండ్ కు తరలించారు.
- ఉప్పల్ హెచ్ఎండీఏ లేఅవుట్లో రామంతాపూర్‌కు చెందిన ముగ్గురు యువకులు సిగరేట్లల్లో గంజాయి నింపుకొని పీల్చుతుండగా పోలీసులు అరెస్టు చేశారు.
- మల్లాపూర్, నాచారం పారిశ్రామికవాడలో కార్మికులకు గంజాయి విక్రయిస్తున్న ఒడిశాకు చెందిన ఒకిల్ బిశ్వాల్ అనే వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
ఇవీ.. ఇటీవల తెలంగాణలోని మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చోటు చేసుకున్న కొన్ని ఘటనలు మాత్రమే.. ఇలా ఎన్నో జరుగుతున్నాయి.
నగరంలో మాదకద్రవ్యాల వినియోగం మహమ్మారిలా మారుతుంది. కొన్ని ప్రాంతాలలో కొంత మంది యువత తెలిసీ తెలియక చెడు బారిన పడుతున్నారు. ఆధునిక పోకడలతో వినాశనాన్ని కోరి తెచ్చుకుంటున్నారు.యువత విలాసాలు ఒక్క సిగరెట్, గ్లాస్ బీరుతో మొదలవుతుంది. రెండో దశలో మద్యపానానికి బానిసలవుతున్నారు. ఈ దశలోనే కొందరు ప్రమాదకరమైన మాదకద్రవ్యాలవైపు ఆకర్షితులై అవసరమైన డబ్బు కోసం నేరాలకు పాల్పడుతున్నారు. ఉప్పల్, మేడ్చల్ నియోజకవర్గాలలో 90 రోజులలో 20 కేసులు నమోదయ్యాయంటే తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
సమాచారం ఇవ్వండి..
"యువత గంజాయి సేవించడం అలవాటుగా మార్చకోవడం.. వారి పెడధోరణికి అద్దం పడుతోంది. అన్నిచోట్ల విరివిగా సరకు అందుబాటులో ఉండటం వల్ల యువత క్రమంగా ఆ వ్యసనానికి బానిస అవుతున్నారు. బీరు, సిగరెట్‌తో మొదలై... క్రమంగా మాదకద్రవ్యాల వైపు ఆకర్షితులై నేరాలకూ వెనకాడటం లేదు. మేడ్చల్ జిల్లా మూణ్నెళ్లలో గంజాయి సంబంధిత 20 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో గంజాయి మత్తు పదార్థాలు అక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించాం. ఇప్పటికే చాలా చోట్ల దాడులు నిర్వహించాం. సరిహద్దు ప్రాంతాల్లో నిఘాతో పాటు తనిఖీలు నిర్వహిస్తున్నాం. గంజాయి విక్రయిస్తున్న తరలిస్తున్న తమకు సమాచారం ఇవ్వాలి" - చంద్రశేఖర్ గౌడ్, అబ్కారీ అధికారి
మేల్కొనకపోతే ముప్పే..
తల్లిదండ్రులు తమ పిల్లల పరిస్థితులు చేయి జారిన తర్వాత మాత్రమే మేలు కుంటున్నారు ధూమపానం వ్యసనంగా మారిన దశలో చాలామంది చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు మద్యపానం మామూలే అని సరిపెట్టుకుంటున్నారు పిల్లలను కాస్త కనిపెట్టాలని బంధువులు, మిత్రులు చేసే సూచనలు పెద్దలకు నచ్చడం లేదు. తమ పిల్లలు అలాంటి వారు కాదని, ఈ కాలంలో ఆలాంటి అలవాట్లు మామూలేనని సమర్థించుకోవడం విశేషం.
విద్యాసంస్థల్లో యువకులకు గంజాయి విక్రయిస్తున్న ముఠాల సమాచారం ఇస్తే వారి ఆటకట్టిస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇదే సమయంలో చిన్నారులు చెడు అలవాట్ల బారిన పడకుండా తల్లిదండ్రులు..... ఓ కన్నేసి ఉంచాలని సూచిస్తున్నారు.
ఇదీ చూడండి: Drugs in Hyderabad: మళ్లీ దొరికిన డ్రగ్స్.. విలువ తెలిస్తే షాకే!