శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల పరిధిలోని జాతీయ రహదారి బంటుపల్లి కూడలి సమీపంలో ఉన్న బీరు పరిశ్రమ వద్ద మంగళవారం రాత్రి ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు పరస్పరం ఢీకొన్నాయి. ఫలితంగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో వ్యక్తి తీవ్రంగా గాయాలపాలయ్యాడు.
పోరాడుతున్న క్షతగాత్రుడు...
రణస్థలం మండలం దువ్వాన్నపేట గ్రామానికి చెందిన దువ్వాన లక్ష్మణరావు, విశాఖపట్నానికి చెందిన అంబటి త్రినాథరావు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఎచ్చెర్ల మండలం ధర్మవరం గ్రామానికి సాధు సతీష్ తీవ్రంగా గాయపడి ప్రాణాల కోసం పోరాడుతున్నాడు.
రాంగ్ రూట్ వల్లే...
త్రినాథరావు, సతీష్‌లు విశాఖపట్నం నుంచి ద్విచక్ర వాహనంపై ఎచ్చెర్ల మండలం ధర్మవరం వెళ్తున్నారు. మార్గమధ్యలో లక్ష్మణరావు తన ద్విచక్ర వాహనంలో పెట్రోల్ నింపకుని రాంగ్ రూట్లో బంకు నుంచి బయటకు వస్తున్న క్రమంలో రెండు వాహనాలు బలంగా ఢీకొన్నాయి. ఫలితంగా అక్కడికక్కడే రెండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.
ఇరు కుటుంబాలకు సమాచారం..
ప్రమాదంపై ఇరు కుటుంబాలకు సమాచారం అందించారు. అనంతరం మృతదేహలను పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం సర్వజన ఆస్పత్రికి తరలించారు. ప్రమాదంపై ఎస్ఐ కె.వాసునారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి :