బుజ్జి బుజ్జి పాదాలు.. చిన్ని చిన్ని చేతులు కదిలిస్తూ చేసే కేరింతలు.. లేలేత పెదాలపై విరబూసే బోసి నవ్వులు.. ఇవన్నీ చూస్తూ ఆ తల్లి మురిసిపోయింది. చిట్టి తల్లిని ముద్దాడి.. ఊయలలో వేసి అమ్మమ్మ నిద్రపుచ్చింది. ఆ బోసి నవ్వుల పాపాయిని చూస్తూ.. పక్కనే తల్లీ నిద్రపోయింది. మెలకువ వచ్చి చూసే సరికి ఊయలలో పాప లేదు.. అప్పటికే ఆ తల్లి గుండె జారిపోయింది. చిన్నారి ఏమైందని ఇళ్లంతా వెతికింది. ముద్దుముద్దుగా చిరునవ్వులు చిందించే పాపాయి.. చివరికి నీటితొట్టిలో విగతజీవిగా పడి ఉండటం చూసి గుండెలు పగిలేలా ఏడ్చింది.. ఈ ఘటన నెల్లూరు నగరంలోని యాదవవీధిలో జరిగింది.
నెల్లూరు నగరంలోని యాదవవీధిలో 17 రోజుల పాపను గుర్తు తెలియని వ్యక్తులు నీటితొట్టిలో వేసి హత్య చేశారు. స్థానిక మహాలక్ష్మమ్మ గుడి సమీపంలో.. ఉదయం 11 గంటల సమయంలో 17 రోజుల పసికందుకు అమ్మమ్మ శారదమ్మ స్నానం చేయించి ఉయ్యాలలో నిద్రపుచ్చింది. తల్లి కూడా నిద్రపోగా, అమ్మమ్మ కిందికి వెళ్లింది. ఆ సమయంలో ఎవరో ఊయలలో ఉన్న పాపను తీసుకువెళ్లి పక్కింటి మేడ పైనున్న తొట్టిలో పడేశారు. మెలకువ వచ్చిన తల్లికి బిడ్డ కనిపించకపోవడంతో చుట్టుపక్కల గాలించారు. నీటి తొట్టిలో చిన్నారి కనిపించింది.
వెంటనే బంధువులు, తల్లి కలిసి చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ఆ పాప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. చిన్నారి తల్లి కన్నీరుమున్నీరుగా విలపించింది. పక్క ఇంట్లో నివసిస్తున్న తమ బంధువైన జ్యోతి చిన్నారిని హత్య చేసిందని చిన్నారి అమ్మమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పాపను ఎవరు నీటితొట్టిలో వేశారనే విషయాలపై పోలీసులు విచారణ చేపట్టారు.
ఇదీ చదవండి: