విశాఖలో సవాళ్ల పర్వం కొనసాగుతోంది. తెలుగుదేశం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైకాపా నేతల మధ్య మాటల యుద్దం జరుగుతోంది. వెలగపూడి... భూ ఆక్రమణలకు పాల్పడకుండా నిజాయితీగా ఉంటే ఆదివారం ఉదయం 11 నుంచి 12 గంటల మధ్యన ఈస్ట్ పాయింట్ కాలనీ సాయిబాబా గుడివద్ద ప్రమాణాలను చేయడానికి రావాలని వైకాపా ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ సవాలు విసిరారు.
ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు అక్రమాలకు సంబంధించిన ఆధారాలతో తాము ఆలయంలోనే ఉంటామని... సచ్ఛీలుడైతే రావాలని అమర్‌నాథ్ డిమాండ్ చేశారు. రుషికొండలో తన అక్రమణలో ఉన్న ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరణ కోసం 2017లో రామకృష్ణబాబు పెట్టుకున్న అర్జీని అధికార్లు తిరస్కరించిన మాట వాస్తవం కాదాని అమర్‌నాథ్ ప్రశ్నించారు. భూమిని ఆక్రమించినందునే దానిని ఇప్పుడు ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు. దీనిని ఆధారాలతో సహా విజయసాయి రెడ్డి బయటపెట్టారన్నారు. ముఖ్యమంత్రికి, విజయసాయికి ఛాలెంజ్ చేసే స్దాయి వెలగపూడికి లేదని అమర్‌నాథ్ అన్నారు.
ఇదీ చదవండి: 'కార్యకర్తలపై దాడులను వైకాపా మానుకోవాలి'