ర్యాపిడో, ఉబర్, ఓలా వంటి సంస్థలు... ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే క్యాబ్ సేవలను అందిస్తున్నాయి. అత్యవసర సమయంలో వేగంగా గమ్యస్థానానికి చేరుకునేందుకు ఈ సేవలు ఉపయోగపడతాయి. సొంత వాహనాలు, లైసెన్స్ ఉంటే ఎవరైనా ఆయా సంస్థల్లో చేరి కమిషన్ పొందొచ్చు. ఇన్నాళ్లూ పురుషులే కెప్టెన్లుగా చేరటంతో.. మహిళలు ఆయా సంస్థల సేవలు వినియోగించుకునేందుకు విముఖత చూపేవాళ్లు. ఇప్పుడు మహిళలు, యువత పెద్దసంఖ్యలో కెప్టెన్లుగా చేరటంతో...ఈ ఇబ్బందులకు పరిష్కారం దొరికింది. ముఖ్యంగా చదువుకుంటున్న యువతులు..పార్ట్‌టైమ్‌గా ఈ సేవలు అందించేందుకు ముందుకొస్తున్నారు. దీంతో వీరికి ఆదాయం.. ప్రయాణీకులకు భరోసా లభిస్తున్నాయి.
నచ్చిన సమయంలో ప్రయాణీకులకు అందుబాటులోకి వచ్చే అవకాశాన్ని పలు సంస్థలు ఇస్తున్నాయి. దీంతో ఇంట్లో పని పూర్తి చేసుకుని ఖాళీగా ఉంటున్న సమయంలో యాప్‌లోకి లాగిన్ అయి..ప్రయాణీకులకు అందుబాటులో ఉంటున్నారు. ఏరోజు ఆదాయం ఆ రోజే వచ్చేయటం, ఇష్టమొచ్చినప్పుడు లాగాఫ్ అయి ఇంటికి వెళ్లిపోవటం, ఒత్తిడి లేమి వంటి వెసులుబాటులు ఉన్నాయని మహిళలు చెబుతున్నారు.
బైక్ సేవలు కావాలనుకునేవారి వివరాలు, సేవలు అందిస్తున్నవారి వివరాలు యాప్‌లో అందుబాటులో ఉండటంతో భద్రతపై భరోసా ఉంటోంది. ముఖ్యంగా మహిళా కెప్టెన్లతో తమకు ఇబ్బంది ఉండదని తోటి మహిళలు భావిస్తుండటంతో... వీటికి క్రమంగా ఆదరణ పెరుగుతోంది.
ఇదీచదవండి