కొవిడ్ పరిస్థితుల నేపథ్యంలో విశాఖపట్నం రిజిస్ట్రేషన్ శాఖ భారీగా ఆదాయాన్ని కోల్పోయింది. మొదటి అర్ధ సంవత్సరంలో రెవెన్యూ లక్ష్యాన్ని సాధించకపోగా పెరుగుదల రేటు -19.91 శాతానికి పడిపోయింది. స్థిరాస్తుల క్రయవిక్రయాలు జరగకపోవడం, మధ్యలో రెండు నెలల పాటు కార్యాలయాలు మూసేయడం తీవ్ర ప్రభావం చూపింది. నగర పరిధిలోని అన్ని కార్యాలయాల్లోనూ ఆదాయం తగ్గిపోయింది. ప్రభుత్వం విశాఖకు రూ.392 కోట్ల లక్ష్యాన్ని విధించగా రూ.229 (58.35 శాతం)కోట్లు మాత్రమే సాధించింది. ఆరు నెలల్లో లాక్‌డౌన్ రోజులు తప్ప మిగిలిన నాలుగు నెలలకు 8 కార్యాలయాల్లో 21,220 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు జరిగాయి. అక్టోబరులో మాత్రం లక్ష్యానికి మించి ఆదాయం సమకూరింది. 2019-20 మొదటి అర్ధ సంవత్సరంలో 26,386 రిజిస్ట్రేషన్లు జరగ్గా రూ.600 కోట్ల ఆదాయం సమకూరింది.
మార్కెట్ విలువలు పెరగటంతో: ఆగస్టు నుంచి మార్కెట్ విలువలు పెరగటంతో సెప్టెంబరు నుంచి ప్రభుత్వానికి ఆదాయం పెరిగింది. మరోవైపు అక్టోబరులో అత్యధికంగా మధురవాడ ఎస్‌ఆర్‌వో నుంచి రూ.15 కోట్లు, ఆర్‌వో నుంచి రూ.14 కోట్ల ఆదాయం సమకూరింది. లక్ష్యానికి మించి రెవెన్యూ సాధించారు.
ఇదీ చదవండి