ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. విశాఖలో ప్రజా పార్లమెంటు జరిగింది. సీపీఐ (యంయల్) లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక, ఏజెన్సీ ప్రాంత రైతులు, ఉక్కు కార్మికులు, ప్రజా సంఘాల ప్రతినిధులు పెద్దఎత్తున ఇందులో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ, వ్యవసాయ చట్టాలను తక్షణమే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (యంయల్) లిబరేషన్ పార్టీ జిల్లా కన్వీనర్ పి.ఎస్ అజయ్ కుమార్, ట్రోలి టైమ్స్ ఎడిటర్(పంజాబ్) నవకిరణ్ నట్, భిలాయ్ స్టీల్ ప్లాంట్ జాతీయ కమిటీ సభ్యులు బ్రిజెన్ తివారి సహా అనేక మంది పాల్గొన్నారు.
విశాఖ జిల్లాలో...
నూతన సాగుచట్టాలు, ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ, డీజిల్, గ్యాస్ ధరల పెంపు సహా పలు సమస్యల పరిష్కారం కోసం.. ఈనెల 26న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకన్న కోరారు. విశాఖ జిల్లా దేవరాపల్లి మండలంలోని పలు గ్రామాల్లో.. ఈ బంద్ గురించి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఉపాధిహామీ పథకం బకాయిల చెల్లింపుతో పాటు రోజువారీ వేతనాన్ని రూ.600కు పెంచాలని డిమాండ్ చేశారు.
విజయనగరంలో...
ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. విజయనగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి కోట జంక్షన్ వరకు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో రాలీ నిర్వహించారు. కేంద్రం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు. ఈ నెల 26న జరగనున్న దేశవ్యాప్త బంద్‌లో కార్మిక, ప్రజా, విద్యార్థి సంఘాలు పాల్గొనాలని పిలుపునిచ్చారు.
విజయవాడలో...
మార్చి 26న తలపెట్టిన భారత్ బంద్‌ను జయప్రదం చేయాలని.. ఏపీ రైతు సంఘాల సమన్వయ సమితి ప్రతినిధులు వై. కేశవరావు, ఆర్.రవీంద్రనాథ్ పిలుపునిచ్చారు. విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో.. రైతాంగ, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసించారు. నూతన సాగు చట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, కేంద్ర విద్యుత్ సంస్కరణలకు వ్యతిరేకంగా జరుగుతున్న బంద్‌లో.. భాజపాయేతర రాజకీయ పక్షాలు, ట్రేడ్ యూనియన్లు, కార్మికులు పాల్గొంటున్నారని తెలిపారు.
కర్నూలులో...
ఈనెల 26న జరగనున్న భారత్ బంద్‌ను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఓబులేసు కోరారు. కేంద్రం ప్రవేశపెట్టిన సాగు చట్టాల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై.. కర్నూలులోని ఎస్టీయూ భవన్లో సదస్సు నిర్వహించారు. కేంద్రం తీసుకుంటున్న ప్రజావ్యతిరేక విధానాలను రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు విమర్శించడం లేదని ప్రశ్నించారు. మోదీ ప్రభుత్వంపై అధికార వైకాపా సరిగా ఒత్తిడి తీసుకురాకపోవడం వల్లే ఉక్కు పరిశ్రమ ప్రైవేటుపరం కాబోతుందన్నారు.
విభజన చట్టంలో ఒక్క హామీనీ కేంద్రం నెరవేర్చలేదని సీపీఎం కేంద్రకమిటీ సభ్యులు ఎం.ఏ.గఫూర్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణానికీ కేంద్రం నిధులు కేటాయించడం లేదన్నారు. ఒక్క కొత్త పరిశ్రమ ఏపీకి రాకున్నా.. ఉన్న వాటిని ప్రైవేటుపరం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం నోరుమెదపడం లేదని కర్నూలులో మండిపడ్డారు. వైకాపా భాద్యత తీసుకుని కేంద్రంపై ఒత్తిడితెచ్చి.. ఉక్కు పరిశ్రమను ప్రైవేట్‌పరం కాకుండా చుడాలని డిమాండ్ చేశారు. ఈనెల 26న జరగనున్న భారత్ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు తెలపాలని కోరారు.
ఇదీ చదవండి: