VISHAKA MANYAM: మన్యంలో డోలీ మోతలు నిత్యకృత్యంగా మారాయి. నిత్యం ఎక్కడో ఒక చోట గర్భిణులను ఆసుపత్రికి తీసుకువెళ్లేందుకు డోలీమోతలపైనే ఆధారపడాల్సి వస్తోంది. తాజాగా.. విశాఖ జిల్లాలోని చింతపల్లి మండలం గొందిపాకలు పంచాయతీ తాటిబంద గ్రామానికి చెందిన గర్భిణి కొర్రాటిక్కోను ప్రసవం కోసం ఆసుపత్రికి తరలించేందుకు కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఘటన శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. రోడ్డు సౌకర్యం లేకపోవడంతో వైద్యులు ఆ గ్రామానికి వెళ్లలేని పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
మారుమూల ఉన్న తాటిబంద గ్రామానికి రహదారి సదుపాయం లేదు. ఎంతటి అత్యవసరం వచ్చినా.. రహదారి ఉన్న మార్గానికి చేరుకోవాలంటే ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న సమగిరి వరకూ కొండలు ఎక్కి, వాగులు దాటాల్సిందే. మూడోసారి గర్భం దాల్చిన టిక్కోకు పురిటినెప్పులు రావడంతో కుటుంబ సభ్యులు డోలీమోతపై రాసపనస గ్రామం వరకూ తీసుకువచ్చారు.
అక్కడ నుంచి 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో ఆమెను తొలుత వాహనంలో డౌనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తరువాత అక్కడి నుంచి నర్సీపట్నం ప్రాంతీయ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సదరు మహిళ ఓ మగశిశువుకు జన్మనిచ్చింది. సకాలంలో కుటుంబ సభ్యులు, 108 సిబ్బంది వారిని ఆసుపత్రికి చేర్చడంతో.. తల్లీ, బిడ్డా క్షేమంగా ఉన్నారు. అయితే.. సకాలంలో ఆసుపత్రికి చేర్చలేక కన్ను తెరవలేకపోయిన అభాగ్యులు ఎందరో..!
అవగాహన లేక ఇక్కట్లు..
సౌకర్యాల పరిస్థితి అలా ఉంటే.. అవగాహనా లోపం కూడా వీరికి ఇబ్బందిగా మారింది. ప్రసవ సమయానికన్నా వారం రోజుల ముందే గర్భిణులను విశ్రాంతి కేంద్రాలకు తరలించేందుకు వీలుగా అధికార యంత్రాంగం తగిన ఏర్పాట్లు చేసినా.. వాటిపై అవగాహన లేక గిరిజనులు ప్రసవ సమయం వరకూ ఇళ్లవద్దే ఉంటున్నారు. ఆఖరి నిమిషంలో వైద్య సహాయం కోసం హడావిడిపడి చివరకు డోలీమోతలపై ఆధారపడుతున్నారు. దీనిపై క్షేత్రస్థాయిలో గిరిజనులకు మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.
ఇదీ చదవండి:
visakhapatnam Rain Updates: ముంచుకొస్తున్న తుపాను ముప్పు.. సహాయ చర్యలకు నౌకాదళం సన్నద్ధం